భద్రాచలం, డిసెంబర్ 21: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదావరి తీరంలో జరుగనున్న స్వామివారి తెప్పోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. గురువారం ఆమె భద్రాచలం పట్టణానికి విచ్చేసి రామయ్య జల విహారానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత శనివారం జరుగనున్న ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం గోదావరిలో హంస వాహన ట్రయల్ రన్‌ను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరిలో భక్తులు స్నానమాచరించేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. హంస వాహనానికి ముందూ వెనక రెండు పైలెట్ నాటు పడవలు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు తీరంలో 40 మంది గజ ఈతగాళ్లు, 20 నాటు పడవలు అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్తర ద్వార దర్శనం వీక్షించేందుకు వచ్చే భక్తులు తమకు కేటాయించిన సెక్టార్లకు వెళ్లి టికెట్ చూపించాల్సి ఉంటుందన్నారు. వాహనాల పార్కింగ్‌కు ఆర్అండ్బీ కార్యాలయం, బ్రిడ్జి పక్కన, జూనియర్ కళాశాల క్రీడా మైదానం, మార్కెట్ యార్డు స్థలాలను కేటాయించామన్నారు. భక్తులకు సమాచారం అందించేందుకు కొత్తగూడెం బస్టాండు, రైల్వే స్టేషన్, భద్రాచలం బ్రిడ్జి పాయింట్, బస్టాండ్, స్నాన ఘట్టాలు, విస్తా కాంప్లెక్స్, కూనవరం రోడ్, మార్కెట్ యార్డు, చర్ల రోడ్డులో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఏరియా ఆసుపత్రిలో 10 బెడ్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. శుక్ర, శనివారాల్లో భద్రాచలం పట్టణంలో మద్యం, మాంసాహార విక్రయాలు నిలిపివేయాలని ఎక్సైజ్‌శాఖ, సివిల్ సప్లయిస్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీవో మధుసూదనరాజు, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఆర్డీవో మంగీలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
పర్ణశాల, డిసెంబర్ 21 : ముక్కోటి ఏకాదశి పర్వదినానికి పర్ణశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం తిరుమంగై ఆల్వార్ పరమపదోత్సవాన్ని 10.30 గంటలకు అర్చకులు ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గోదావరి నదిలో స్వామివారికి వైభవంగా తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు ఇనుప కంచెను నిర్మించి హెచ్చరిక బోర్డులు అమర్చారు. ఆలయ ప్రాంగణం బయట, చుట్టుపక్కల ప్రాంతంలో పంచాయతీ అధికారులు పారిశుధ్య పనులు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగే తెప్పోత్సవం కార్యక్రమం కోసం గురువారం అధికారులు గోదావరిపై ట్రయల్ రన్ నిర్వహించారు. సీఐ రమేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఎంపీడీవో ముత్యాలరావు, నీటిపారుదల శాఖ ఈఈ నాగేశ్వరరావు, ఏఈ రాజుసుహాస్, ఎస్సైలు కేశవ్, గణేశ్, దుమ్ముగూడెం పోలీస్ సిబ్బంది, కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.