భద్రాచలం, డిసెంబర్ 8: గ్రామంలో లభించే సహజ వనరులైన మట్టి, సున్నం, సిమెంటు కలిపి తయారుచేసిన ఇటుకలతో అందమైన కట్టడాలను నిర్మించుకోవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అవసరమైన హంగులతో ఇళ్లను తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. భద్రాచలంలో ఆదివారం పర్యటించిన ఆయన.. ఇక్కడి ఐటీడీఏ వైటీసీలో తక్కువ ఖర్చుతో పర్యావరణానికి అనుకూలంగా మంచి మన్నిక కలిగిన నిర్మాణాల కోసం తయారుచేస్తున్న మట్టి ఇటుకలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టితో అందమైన నివాసగృహాలు నిర్మించుకొని జీవనాధారం సాగిస్తే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని అన్నారు. పదికాలాలపాటు జీవించవచ్చునని అన్నారు. ఇటుకల తయారీలో గతంలో కొందరికి శిక్షణ ఇచ్చామని, శిక్షణ తీసుకున్న గిరిజనులు వారి వారి గ్రామాల్లో అవగాహన కల్పించి మట్టి ఇటుకల తయారీకి ముందుకొస్తున్నారని అన్నారు. పంచాయతీ ఈవో శ్రీనివాస్, ట్రైబల్ మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియాన్ని కలెక్టర్ జితేశ్ ఆదివారం సందర్శించారు. మ్యూజియంలో నిర్మిస్తున్న గడ్డి ఇళ్లను, స్టాళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రధానంగా గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా అన్ని హంగులూ ఉండాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు డేవిడ్‌రాజ్, హరీశ్, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, స్రవంతి, సురేందర్, హేమంతిని, నాగేశ్వరరావు, శ్రావణ్‌కుమార్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.