కొత్తగూడెం అర్బన్, నవంబర్ 6: విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులు, సీనియర్ సిటిజన్లు.. పుస్తకాలు, పత్రికలను చదువుకునేలా గ్రంథాలయంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా గ్రంథాలయాన్ని బుధవారం సందర్శించిన కలెక్టర్.. అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
‘పుస్తకాలు చదువుకోవడానికి శాశ్వత సభ్యత్వం ఎంత? విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా? స్టోర్ రూమ్ కురుస్తోందా? మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు ఇతర సౌకర్యాలు ఉన్నాయా?’ అని అడిగి తెలుసుకున్నారు. ‘పుస్తకాలకు ఇన్‌వార్డు నంబర్ ఉందా.? లేదా?’ అని తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, దినపత్రికలు, నవలలు తదితరాలను విభజించి అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, గ్రంథాలయ అధికారి నవీన్‌కుమార్, లైబ్రేరియన్ మణిమృదుల పాల్గొన్నారు.