సారపాక, సెప్టెంబర్ 18 : ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఐటీసీ సహకారంతో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్‌ను పరిశీలించి.. సరైన ప్రణాళిక లేకుండా నిర్మించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పల్లెల్లో వెస్ట్రన్ టాయిలెట్స్ ఏమిటని అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఐటీసీ నుంచి లెటర్ పెట్టించాలని వైద్యాధికారికి సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఆర్వో, ఆక్సిజన్ ప్లాంట్లను పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులకు తయారు చేస్తున్న వంటలను పరిశీలించి నాణ్యతతో తయారు చేయాలని సూచించారు.
అనంతరం గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు, పాఠశాల పీడీ బదిలీ తదితర సమస్యలపై న్యాయవాది భజన సతీశ్, ప్రసాద్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబు, తహసీల్దార్ ముజాహిద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు, వైద్యులు అనిత, సబితారెడ్డి, మౌనిక, ఆసుపత్రి సిబ్బంది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.