భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/మామిళ్లగూడెం, ఆగస్టు 2 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని ఈ నెల 5 నుంచి 9 వరకు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నిర్వహించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ఈ కార్యక్రమం కింద గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
ఈ నెల 5న ‘మన బాధ్యత’ కార్యక్రమం పేరిట ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలతోపాటు ఇతర ప్రజా సంచార ప్రాంతాల్లో ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 6న ‘నీళ్లు పట్టేద్దాం.. నీటిని కాపాడుదాం’ కార్యక్రమం పేరిట గ్రామాల్లోని అన్ని తాగునీరు ట్యాంకులను శుభ్రం చేయాలని, మొక్కలు నాటాలని ఆదేశించారు. 7న ‘సరిచేద్దాం’ కార్యక్రమం పేరిట మురుగు కాలువల్లోని పూడికతీత పనులు చేపట్టాలని, రహదారుల మధ్య ఏర్పడిన గుంటలను పూడ్చాలని సూచించారు.
8న ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ పేరిట జ్వర సర్వే నిర్వహించాలి. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 9న ‘స్వచ్ఛ కార్యాలయం/నివాసం-అందరికీ స్వాగతం’ పేరిట శిథిల భవనాలు, కార్యాలయాలను కూల్చివేయాలని, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు డీ.వేణుగోపాల్, విద్యాచందన, అధికారులు అర్జున, భాస్కర్నాయక్, పురందేశ్వరరావు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 5 నుంచి 9 వరకు చేపట్టనున్న ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’పై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థాయి నుంచి కమ్యూనిటీ స్థాయి వరకు మొకలు నాటాలని సూచించారు.
ప్రజలు, స్థానిక నాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, వార్డు కమిటీల బాధ్యులను భాగస్వామ్యం చేస్తూ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ నిర్ణీత కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి పారిశుధ్యం, ప్లాస్టిక్ వినియోగం, సీజనల్ వ్యాధులు, ప్రజా, ప్రభుత్వ స్థలాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా అధికారులు సన్యాసయ్య, వినోద్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.