భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): అధిక ఆదాయాన్నిచ్చే మునగ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ఆ దిశగా వారికి అవగాహన కల్పించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వ్యవసాయాధికారులకు సూచించారు. మొరింగ ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్, చేపలు, పుట్టగొడుగుల పెంపకంపై అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి ఐడీవోసీ నుంచి జిల్లాలోని నర్సరీల యజమానులు, వ్యవసాయ అకారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని రైతులు వేసవిలో వ్యవసాయ భూములు ఖాళీగా ఉంచకుండా మునగ సాగు చేయాలని, దీని ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని అన్నారు. మునగ ఆకు పొడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మొదటి విడతలో జనవరి నెలలో పది వేల ఎకరాల్లో రైతులు మునగ సాగు చేపట్టే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో చాలా ఎకరాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో వెదురు మొక్కలు నాటాలని ఆదేశించారు. సాగునీటి కాల్వలకు ఇరువైపులా జామాయిల్, వెదురు, సుబాబుల్ మొక్కలు నాటాలన్నారు. అలాగే పుట్టగొడుగులు, చేపల పెంపకం ఎక్కువగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అజోల్ల సాగు నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుందని, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యత ఆధారంగా సాగు చేయాలని సూచించారు. డీపీవో చంద్రమౌళి, అదనపు డీఆర్డీవో రవి, డీఏవో బాబూరావు, జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ పృథ్వీ, స్త్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.