భద్రాచలం, ఫిబ్రవరి 25: భద్రాచలంలో ఈ ఏడాది శ్రీరామనవమి ఏర్పాట్లు బాగుండాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించి సంతోషంగా తిరిగి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఏటా వైభవంగా జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలు కరోనా కారణంగా రెండేళ్లుగా ఆంతరంగికంగానే జరుగుతున్నాయన్నారు. ఈ సారి మిథిలా స్టేడియంలో జరుగనున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకని ఎక్కడా రాజీ లేకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శ్రీరామనవమి ఏర్పాట్లపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం, పర్ణశాలల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని, ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చేపట్టాల్సిన 17 అంశాలతో కూడిన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయినందున యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 25 నాటికి పనులు మొత్తం పూర్తి కావాలన్నారు. వేసవి కావడంతో ఎండల నుంచి భక్తులకు రక్షణగా గాలి, వెలుతురు బాగా వచ్చేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, అగ్ని ప్రమాదాల నివారణ, ప్రచార, రవాణా, వైద్య శిబిరాలు, ప్రసాదాల విక్రయం, తలంబ్రాల పంపిణీ, పార్కింగ్, టికెట్లు, పెయింటింగ్ తదితర పనులన్నింటినీ రిమార్కు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కరకట్ట రెయిలింగ్‌కు మరమ్మతులు నిర్వహించి రంగులు వేయాలని, ప్రతిచోట ఎల్ఈడీ బల్బులు అమర్చాలని, కరకట్టపై ఉన్న బొమ్మలకూ రంగులు వేయించాలని సూచించారు. పట్టణమంతా పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఉండాలని, గోదావరి వంతెనపై బంగారు రంగు గల బల్బులను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. స్వామివారిని దర్శించుకునే వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక లైను ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచాలన్నారు. స్వామివారి తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉన్నందున భక్తులు తలంబ్రాలు, ప్రసాదాలు దొరకలేదని నిరాశ చెందకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు సులభంగా కల్యాణం, పట్టాభిషేకం టికెట్లు కొనుగోలు చేసే విధంగా వారం రోజుల్లో ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. నాలుగు 108 వాహనాలను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల సౌకర్యం కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి దుర్వాసన రాకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచాలని, ప్రైవేటు వాహనాల పార్కింగ్‌ను రవాణా శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, ఉత్సవాల రోజుల్లో మద్యం, మాంసం విక్రయాలు జరుగకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సబ్ కలెక్టర్‌కు సూచించారు. అనంతరం భద్రాచలం ఇన్చార్జి ఏఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ స్టేడియాన్ని 12 సెక్టార్లుగా విభజించి బందోబస్త్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం కలెక్టర్ అనుదీప్.. మిథిలా స్టేడియం, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాల పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఇన్చార్జి సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో బానోత్ శివాజీ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.