అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్ 29: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. రైతులు విక్రయానికి తరలించిన ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోలు ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం పెంట్లం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి, నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీవో మహాలక్ష్మి, ఏవో అనూష, సర్పంచ్ కారం శివ తదితరులు పాల్గొన్నారు.