భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గిరిజన ప్రాంతాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించడం వల్ల తగిన గుర్తింపు లభించడంతోపాటు వివిధ స్థాయిల్లో అవార్డులు దక్కాయని కలెక్టర్ అంకిత్ అన్నారు. ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల సిబ్బందికి ప్రశంసా పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని పాల్వంచ పెద్దమ్మగుడి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లాలోనాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఈ క్రమంలోనే జిల్లా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా వారి ఆరోగ్య స్థితిని మెరుగుపర్చడంలో వైద్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఈ విజయానికి ఆశా కార్యకర్తల నుంచి ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్యులు, జిల్లాస్థాయి అధికారుల వరకు అందరి సమన్వయం ముఖ్య కారణమని ప్రశంసించారు. ప్రతీ ఏడాది మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు జిల్లాకు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, తహసీల్దార్ దారా ప్రసాద్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.