ఖమ్మం, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):జగత్కల్యాణానికి వేళ అయ్యింది. మరికొద్ది గంటల్లో మధుర ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రాములోరి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చే తరుణం వచ్చేసింది. వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తుండగా, మంగళ వాద్యాలు మోగుతుండగా అర్చకులు అభిజిత్ ముహూర్తాన సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు శ్రీరామనవమి ఉత్సవాలను ఆంతరంగికంగానే నిర్వహించారు. ఈ ఏడాది కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కల్యాణ క్రతువుకు మిథిలా స్టేడియం ముస్తాబైంది. చలువ పందిళ్లు, విద్యుత్‌కాంతులతో వేదిక ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకున్నది. ఇందులోభాగంగా శనివారం రాత్రి భద్రాచలం దేవస్థానంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు. ఆదివారం మిథిలా మండ పంలో ఘనంగా శ్రీసీతారాముల కల్యాణం జరుగనున్నది. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు అర్చకులు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్ అనుదీప్, దేవస్థాన ఈవో బానోతు శివాజీ పర్యవేక్షిస్తున్నారు.
జగదభిరాముడు, అందాల సీతమ్మ కల్యాణ మహోత్సవానికి భద్రగిరి ముస్తాబైంది. శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చే తరుణం వచ్చేసింది. వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తుండగా, మంగళ వాద్యాలు మోగుతుండగా అర్చకులు అభిజిత్ ముహూర్తాన సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కొవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలను భక్తులకు దూరం చేసింది. ఆలయ అధికారులు ఆంతరంగికంగానే సీతారాముల కల్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక వేడుకలు నిర్వహించారు. ఈ ఏడాది కొవిడ్ ప్రభావం లేకపోవడంతో అంగ రంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం భద్రాచలంలోని రాములోరి ఆలయ సన్నిధిలోని మిథిలా మండపంలో ఘనంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం జరుగనున్నది.
ఉదయం 9.30 గంటలకు అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్ఛారణ మధ్య మండపానికి తీసుకురానున్నారు. సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన అర్చకులు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ అనుదీప్, దేవస్థాన ఈవో బానోతు శివాజీ పర్యవేక్షిస్తున్నారు.

కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాక పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. వారి కోసం ఆలయ అధికారులు మండపంలో చలువ పందిళ్లు, షామియానా ఏర్పాటుచేశారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా 200 ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం కల్పించారు. తలంబ్రాలకు 80 కౌంటర్లు, ప్రసాదాలకు 30 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల ఆరోగ్య సంరక్షణకు వైద్యారోగ్యశాఖ పట్టణంలోని పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. సోమవారం ఆలయ సన్నిధిలో ఘనంగా మహాపట్టాషేక వేడుక జరుగనున్నది.
ఎక్కడ చూసినా భక్తుల సందడే..
సాయంత్రం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్లో శనివారం రాత్రి ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. వేడుకలకు రూ.3 లక్షల మంది భక్తులు రావొచ్చని ఆలయ అధికారులు అంచనా వేశారు. భక్తులు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు స్టేడియం బయట పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గోదావరి స్నాన ఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. రామాలయ మా డవీధులు, గోదావరి ఘాట్లలో చలువ పందిళ్లు వేశారు. రామాలయాన్ని సప్తవర్ణ విద్యుద్దీపాలతో అలంకరించడంతో శనివారం రాత్రి దేదీప్యమానంగా ఆలయం కనువిందు చేసింది.
శ్రీరామనవమి వేడుకలకు మంత్రి పువ్వాడ
ఖమ్మం, ఏప్రిల్ 9: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజరు కానున్నట్లు మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఎంఎస్ గౌతమ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7:30కు ఖమ్మం మంత్రి నివాసం నుంచి బయలుదేరి 9:15కి సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకుంటారు. అక్కడ స్వల్ప విరామం అనంతరం 9:40కి సారపాకలో బయలుదేరి 10 గంటలకు మిథిలా స్టేడియంలో జరిగే కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:30కి భద్రాచలం నుంచి బయలుదేరి సాయంత్రం 3:30కి ఖమ్మం చేరుకుంటారు.
భారీ బందోబస్తు..
వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ భారీ 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణ టిక్కెట్లు చేతిలో ఉంటేనే పోలీసులు, సిబ్బంది మిథిలా స్టేడియంలోని సెక్టార్లలోకి భక్తులను అనుమతిం చనున్నారు. టిక్కెట్లు కొన్న భక్తులు తమ సెక్టార్లలోకి నేరుగా వెళ్లేందుకు ఆలయ అధికారులు పట్టణంలో రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యాలపై తహసీల్దార్లు పర్యవేక్షించనున్నారు.

సమస్యలపై కంట్రోల్ రూంకు ఫోన్ చేయండి:కలెక్టర్
భద్రాచలం, ఏప్రిల్ 9: భక్తుల సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, భక్తులు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. శనివారం రాత్రి ఆయన వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి మాట్లాడారు. తప్పిపోయిన వ్యక్తులు, చిన్నారుల సమాచారం కోసం 08743-232433, 08743-232301, 08743-232444ను సంప్రదించాలని కోరారు. గోదావరిలో పవిత్ర స్నానం చేసే భక్తులు నిర్దేశిత ప్రాంతంలోకే వెళ్లాలన్నారు. లోతు ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. అనారోగ్యం పాలైన భక్తులు వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాల వద్దకు వెళ్లాలన్నారు. వేడుకలకు వచ్చే వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక వసతులు కల్పించామన్నారు. ఆయన వెంట ఇన్చార్జి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్ చక్రవర్తి, పీఆర్వో మంగ్యానాయక్, డీఈ రాజేశ్వరరావు, తహసీల్దారు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం
వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ సన్నిధిలో ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను భక్తాగ్రేసరుడు శ్రీరామదాసు చేయించిన ఆభరణాలతో అలంకరించి. మిథిలా ప్రాంగణానికి ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్దకు తీసుకుచ్చారు. సీతమ్మ తల్లిని రామయ్య తండ్రికి ఎదురుగా ఉంచారు. కొందరు అర్చకులు రామయ్య తరఫున, మరికొందరు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించారు. కనుల పండువగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఎదుర్కోలు ఉత్సవ ప్రాధాన్యాన్ని వివరించారు. రామయ్య గుణగుణాలు, సీతమ్మ అందచందాలను వర్ణించారు. వేడుకలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, హైకోర్టు జడ్జీ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, దేవస్థాన ఈవో బానోత్ శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.

కల్యాణ మహోత్సవానికి పర్ణశాల సిద్ధం
పర్ణశాల, ఏప్రిల్ 9: శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి పర్ణశాల ముస్తాబైంది. విద్యుద్దీపాలంకరణతో ఆలయం కళకళలాడుతున్నది. ఆలయ అర్చకులు ఆదివారం మధ్యాహ్నం కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి కల్పించారు. కల్యాణ వేదిక వద్ద షామియానా ఏర్పాటు చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. ఇరిగేషన్ అధికారులు గోదావరి వద్ద భక్తుల రక్షణకు గజ ఈతగాళ్లను నియమించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు పర్ణశాలకు బస్సు సర్వీసులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ రమేశ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్ల పరిశీలన
కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను శనివారం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి పరిశీలించారు. ఏర్పాట్లపై అలసత్వం వహించొద్దని ఆలయ అధికారులకు సూచించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గోదావరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గజ ఈతగాళ్లను అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి వెంట ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, ఆలయ అసిస్టెంట్ ఈవో భవానీ రామకృష్ణ, సూపరింటెండెంట్ కిశోర్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
శిల్పకళా శోభితం.. మిథిలా కల్యాణ మండపం
–గణపతి స్థపతి నైపుణ్యానికి దర్పణం
భద్రాచలం, ఏప్రిల్ 9: భక్తజనమంతా ఎదురు చూసే రోజు శ్రీరామనవమి. ఈరోజే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం. భద్రగిరి జనసంద్రం. మిథిలా నగర మండపమే కల్యాణ వేదిక. అశేష భక్త వాహిని. అంతమందికీ అనువుగా నిర్మితమైంది మిథిలా నగరం. ఏటా ఈ మండపంలోనే రాములోరి పెండ్లి వైభవంగా జరుగుతుంది. మండపానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వీకుల శిల్పకలా వైభవానికి మండపం ఒక మచ్చు తునక. 1960 మే 30వ తేదీన అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండపాన్ని తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత శిల్పి గణపతి స్థపతి నిర్మించారు. శిల్పాల కోసం ఆయన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా నల్లరాళ్లను తెప్పించారు. మండపంపై కప్పులో 12 రాశులను అందంగా మలిచారు. సీతారాముల కల్యాణం, పట్టాభిషేక ఘట్టాలు, పుట్టలోని సీతారాములను పూజిస్తున్న భక్తురాలు పోకల దమ్మక్క, కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న శ్రీకృష్ణుడు, జనకుడి కొలువులో శివ ధనుస్సును విరుస్తున్న శ్రీరాముడి చిత్రాలను ఎంతో అందంగా చెక్కించారు. మండపం మధ్యభాగంలో పద్మాకారంలో నిర్మించిన పీఠం మండపానికే ప్రత్యేక ఆకర్షణ. ఈ పీఠంపైనే సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఉంచి వేదపండితులు జగత్కల్యాణం జరిపిస్తారు. మండపం పైభాగంలో చెక్కిన రాతి గొలుసులు అచ్చం ఇనుప గొలుసుల్లా కనిపించడం విశేషం. మండపం నిర్మించిన నాటి నుంచి కేవలం రెండు సార్లు (2020, 2021) మాత్రమే శ్రీరామనవమి ఉత్సవాలు నిలిచిపోయాయి. కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్స్ కారణంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయంలో ఆంతరంగికంగానే వేడుకలు నిర్వహించాల్సి వచ్చింది.
ముగ్గురమ్మల ఆశీర్వాదం.. సీతమ్మ మంగళసూత్రం
భద్రాచలం, ఏప్రిల్ 9: దక్షిణ అయోధ్యాపురి భద్రగిరిలో ఏటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామ కల్యాణ మహోత్సవ వేడుకలకు ప్రత్యేక ఉంది. అలాగే సీతమ్మ తల్లి మంగళసూత్రాలకూ ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా పెండ్లికూతురికి మాంగల్యధారణ జరిగే సమయంలో రెండు మంగళసూత్రాలు మాత్రమే ఉంటాయి. వధువు పుట్టింటివారు ఒక సూత్రం, మెట్టినింటి వారు మరో సూత్రాన్ని ఇస్తారు. వీటితోనే వధువుకు మాంగల్యధారణ జరుగుతుంది. కానీ భద్రాద్రి రామయ్య మూడు సూత్రాలు ఉన్న మంగళ సూత్రంతో మాంగళ్యధారణ చేస్తాడు. వీటిలో సీతమ్మ తండ్రి జనకుడు ఒక సూత్రం, రాముడి తండ్రి దశరథుడు మరో సూత్రం చేయిస్తారు. వీటితోపాటు భక్తాగ్రేసరుడు, వాగ్గేయకారుడు శ్రీరామదాసు మూడో సూత్రం చేయిస్తాడు. సీతమ్మను రామయ్యకు కన్యాదానం చేసే సమయంలో భక్తులు తమ మదిలో రామయ్యను కొలుస్తున్నారనేందుకు ఈ మూడో సూత్రం నిదర్శనంగా నిలుస్తుందని వేదపండితుల మాట. వధువు సుమంగళి కావడానికి వివాహ పమయంలో ఈ మంగళసూత్రాన్ని గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవీ మూర్తుల ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు.

అంతా క్లీన్ అండ్ గ్రీన్ !
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఏటా ఒక్క సారే సీతారాముల కల్యాణ వేడుక. భద్రగిరికి లక్షలాది మంది భక్తుల రాక. భక్త జనసంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రతపై దృష్టి సారించారు కలెక్టర్ అనుదీప్. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చి అందుకుతగిన ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు, కాలువలు, మరుగుదొడ్లు, పట్టణ వీధులను శుభ్రం చేయించేలా ఏర్పాట్లు చేశారు. పట్టణాన్ని మొత్తం 15 జోన్లుగా విభజించి ఇద్దరు డీఎల్పీవోలు, 20 మంది ఎంపీవోలు, 86 పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. 500 పారిశుధ్య కార్మికులు డ్రెస్ కోడ్‌లో పారిశుధ్య పనులు చేపడతారు. రహదారులను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించేందుకు ఒక స్వీపింగ్ యంత్రాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే కలెక్టర్ అనేక సార్లు ఏర్పాట్లను పరిశీలించారు. టెలీ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులకు తగిన సలహాలు, సూచనలిచ్చారు.