భద్రాచలం, డిసెంబర్ 25 : క్రీడల్లో ఓటమి సహజమని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ పేర్కొన్నారు. ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన ప్రత్యర్థి జట్లతో శత్రుత్వం పెంచుకోవద్దని సూచించారు. స్నేహపూర్వక ఆటలే క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భద్రాచలంలోని గిరిజన మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహించిన అవుట్ డోర్ షెటిల్ బ్యాడ్మింటన్ పోటీల ముగింపు వేడుకకు గురువారం ఆయన హాజరయ్యారు. గెలుపొందిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రకటించిన ప్రకారం క్రీడాకారులకు నగదు బహుమతితోపాటు మెమెంటోలను ప్రదానం చేశారు. టోర్నమెంట్ మొదటి విజేతలు కుంజా సురేష్‌కుమార్, సోడే శ్రీనులకు రూ.8 వేలు, రెండో విజేతలు తాటి పవన్, సాయిలకు రూ.6 వేలు, మూడో విజేతలు కిరణ్, లక్ష్మణ్‌లకు రూ.4 వేలు, చతుర్థ విజేతలు హరీష్, అతడి జతగాళ్లకు రూ.2 వేల నగదు బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైబల్ మ్యూజియంలో క్రీడలతోపాటు త్వరలో వారాంతాల్లో వివిధ పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. కాగా, బెస్ట్ ప్లేయర్ అవార్డు అందజేసిన బీకే స్పోర్ట్స్‌ను పీవో ప్రత్యేకంగా ప్రశంసించారు. గోపాల్‌రావు, నాగేశ్వరావు, రాంబాబు, ముత్తయ్య, బట్టా హరికృష్ణ, గొంది వెంకటేశ్వర్లు, డాక్టర్ విజయరావు, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ మల్లేశం, రాజా రమేష్ బ్రదర్స్, బాలకిరణ్ (బీకే ), వరుణ్ నాగరాజ్, సంతోష్, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.