భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 15 (నమస్తే తెలంగాణ): ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విజయవంతం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహారభద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు విధివిధానాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ నాలుగు సంక్షేమ పథకాల అమలును ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నారని, ఈ నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులందరూ నిబద్దతతో పనిచేయాలని అన్నారు.
గ్రామసభలను పక్కాగా నిర్వహించాలని, ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు చేపట్టే క్షేత్రస్థాయి సర్వేలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని, 16 నుంచి 20వ తేదీ వరకు లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలు పక్కాగా జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, 21 నుంచి 25వ తేదీ వరకు డేటా ఎంట్రీలో తప్పులు దొర్లకుండా చూడాలని అన్నారు., ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.