సత్తుపల్లి, మే 25 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తుండడంతో లబ్ధిదారులు నానా హైరానా పడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షలతోపాటు మరికొంత వేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకుందామని భావించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా ఉండాలని, ఇందుకు ఇంచు పెరిగినా బిల్లులు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతుండడంతో దిగులు చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కేటాయించింది. అయితే ఇవి అర్హులకు సరిపోవని, ఇంకా కేటాయించాలని పలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. అర్హులైన ఎంతో మంది నిరుపేదలు వేలల్లో దరఖాస్తు చేసుకోగా.. వారిలో 10 శాతం మందికి కూడా ఇండ్లు దక్కడం లేదు. ఈ క్రమంలో అధికారులు విధిస్తున్న నిబంధనలతో వారి సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చాలా మంది నిరుపేదలు తమ గుడిసెలు, రేకుల షెడ్లను కూల్చివేసి.. ప్రభుత్వం పైసా ఇవ్వకున్నా బేస్మెంట్ లెవల్ వరకు అప్పోసప్పో చేసి పనులు చేపట్టారు. వారం రోజులుగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇండ్లు మంజూరైన వారికి పట్టాలు అందించడంతో గ్రామాల్లో ముగ్గులు పోసుకొని ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయితే కొందరు అదనంగా విస్తరించి ఇంటి నిర్మాణం చేపడుదామనుకున్నా నిబంధనలు విధించడంతో అయోమయానికి గురవుతున్నారు.
కమిటీల కనుసన్నల్లో లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని ప్రకటించింది. అయితే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు సూచించిన వారికే ఇళ్లను కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు ఇచ్చిన జాబితా ప్రకారమే ఎమ్మెల్యే ఫైనల్ చేయడంతో వారికే ఇండ్లు దక్కినట్లు తెలుస్తోంది. దీంతో అర్హులకు ఇండ్లు దక్కకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అర్హులను గుర్తించి పారదర్శకంగా ఇండ్లు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
అర్హులకే కేటాయించాలి..
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి. ఇండ్ల కేటాయింపులో రాజకీయం లేకుండా నిజమైన నిరుపేదలకు మంజూరు చేయాలి. ఇప్పటికే చాలా మంది గుడిసెలు, రేకుల షెడ్లు తొలగించుకొని ఎదురుచూస్తున్నారు. ఇండ్ల విషయంలో కమిటీల ప్రమేయం లేకుండా నిరుపేదలకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
-గోదా శ్రీనివాసరావు, వీఎం బంజర, పెనుబల్లి