ఖమ్మం, డిసెంబర్ 22 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రతియేటా డిసెంబర్ 25వ తేదీన క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులు నెలరోజుల ముందునుంచే సన్నద్ధమవుతున్నారు. నగరంలోని చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. మార్కెట్లో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తున్నది. కేకులు ఆర్డర్స్ ఇస్తుండడంతో స్వీటుషాపులు కిటకిటలాడుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ కొత్త వస్ర్తాలను కొనుగోలు చేసి గృహాలకు రంగులు అద్దుకుని పండుగను వైభవంగా నిర్వహించుకుంటారు. ధనవంతులైన క్రైస్తవులు పేదలకు దానధర్మాలు చేస్తారు.
నగరంలో సందడే.. సందడి
క్రిస్మస్ సందర్భంగా ఖమ్మం నగరంలోని షాపుల్లో సందడి నెలకొంది. పండుగకు వారంరోజుల ముందునుంచే సందడి మొదలైంది. సంవత్సరంలో అతిపెద్ద పండుగ క్రిస్మస్ కావడంతో ఎక్కడచూసినా క్రైస్తవ సోదరులతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధాన పట్టణాల్లోని మారెట్లలో క్రిస్మస్ షాపింగ్ ఊపందుకుంది. క్రిస్మస్ కేక్స్, చాక్లెట్స్, స్వీట్లను ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. కమాన్‌బజార్, కస్బాబజార్, వైరారోడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్, రోటరీనగర్, మమత రోడ్డు, ఎన్ఎస్టీ రోడ్డు, స్టేషన్‌రోడ్డులోని ఫ్యాన్సీ షాపుల్లో క్రిస్మస్ ట్రీ, స్టార్స్, డెకరేషన్ మెటీరియల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
పండుగను పురస్కరించుకుని నగరంలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. క్రైస్తవుల ముఖ్యమైన పండుగ కావడంతో వస్త్ర దుకాణాల్లో ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో అందంగా అలంకరించారు. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించేలా బాలయేసు కన్య మరియ, గొర్రెల కాపరులు, జ్ఞానులు, దేవతులను పోలిన బొమ్మలు, పశువుల పాకలను రూపొందించారు.
సెమీ క్రిస్మస్ల సందడి
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కులమతాలకతీతంగా జిల్లాలో పండుగకు నెలరోజుల ముందునుంచి సెమీ క్రిస్మస్లు జరుపుకుంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వశాఖల్లో అధికారులు సెమీ క్రిస్మస్ జరుపుకున్నారు. పాఠశాలలో క్రిస్మస్ విశిష్టత గురించి పశువులకొట్టం, యేసు ఉయ్యాలలో పడుకున్న దృశ్యాలు, క్రిస్మస్ ట్రీ తదితర యేసుక్రీస్తుకు సంబంధించిన దృశ్యాలు ఏర్పాటు చేసి, విద్యార్థులతో క్రిస్మస్ తాత వేషధారణాలు వేసి వేడుకలను జరుపుకున్నారు.
కొన్ని పాఠశాలల్లో చర్చిలను తలపించేలా సెట్టింగులు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ను పురస్కరించుకుని జిల్లాలోని అనేక ప్రాంతాల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్రైస్తవులు మరణించిన పూర్వీకుల పేర్లమీద దానధర్మాలు చేస్తున్నారు. ఆదివారం జరిగే క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులందరూ
సన్నద్ధమవుతున్నారు.
ఊపందుకున్న అమ్మకాలు
ప్రపంచానికి శాంతిని అందించిన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవులు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ రానే వచ్చింది. దీనిలో భాగంగా క్రైస్తవులు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇళ్లపై స్టార్స్ ఏర్పాటు చేస్తున్నారు. శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాత మాస్కులు, కలర్ లైట్లు, బెలూన్లు, గంటలు, క్రిస్మస్ క్యాండిల్స్తోపాటు వివిధ రకాల వస్తువులు అమ్మకాలకు మార్కెట్లో ఉంచడంతో కొనుగోలుదారులతో సందడిగా మారింది.
శాంతాక్లాజ్(క్రిస్మస్ తాత బొమ్మలు), స్టిక్కర్లు, బొమ్మలు, మాస్క్‌లు సైజులను బట్టి రూ.10 నుంచి రూ.200 వరకు లభిస్తున్నాయి. స్టార్లలో థర్మాకోల్, ప్లాస్టిక్, పేపర్, లైటింగ్ స్టార్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సైజును బట్టి రూ.10 నుంచి రూ.400 వరకు ఉన్నాయి. బెలూన్లు సైజును బట్టి రూ.30 నుంచి అందుబాటులో ఉన్నాయి. క్రిస్మస్ ట్రీలు రూ.50 నుంచి 500 వరకు, ప్రత్యేక అలంకరణ సామగ్రి రూ.600 వరకు లభిస్తున్నాయి. క్రీస్తు జన్మదినానికి సంకేతంగా ఇళ్లలో పశువుల పాక వేస్తారు. ఇందులో ఉంచే బొమ్మలు రూ.80 నుంచి 600 వరకు విక్రయిస్తున్నారు.