మధిర, ఆగస్టు 06 : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మధిర టౌన్ ఎస్ఐ కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనిధి కాలేజీలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎస్ఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వారి తల్లిదండ్రులకు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.
వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దన్నారు. అటువంటి లింకులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో అనవసరమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు లింకులు పంపి అనేక నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడితే తక్షణమే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపక బృందం పాల్గొంది.