ఖమ్మం జిల్లాలో బీసీల ఆత్మగౌరవ భవనం అసంపూర్తిగా దర్శనమిస్తున్నది. నాటి బీఆర్ఎస్ సర్కార్ పాలనలో భవన నిర్మాణం ప్రారంభమై 70 శాతం పనులు పూర్తయినప్పటికీ మిగిలిన 30 శాతం పనులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతున్నది. కేసీఆర్ నాయకత్వంలో నాడు బీసీల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి జరిగింది.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్ర రాజధానిలో వివిధ వర్గాలకు ఉపయోగకరంగా ఉండేందుకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించారు. అదే తరహాలో జిల్లా కేంద్రాల్లోనూ ఆయా వర్గాల అవసరాల నిమిత్తం ఆత్మగౌరవ భవనాలను నిర్మించారు. కొన్ని జిల్లాల్లో భవనాలు అందుబాటులోకి రాగా.. సేవలు సైతం పొందుతున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా బీసీ భవన నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయగా.. జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు.
-మామిళ్లగూడెం, డిసెంబర్ 20
నాటి మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు 2021 జనవరి 1న ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ నిర్దేశిత గడువులోగా దాదాపు 70 శాతం పనులను పూర్తి చేసింది. ఆ సమయంలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో భవన నిర్మాణ పనులు అటకెక్కాయి. పనులు చేపడుతున్న గుత్తేదారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూల వ్యక్తి అనే కారణంతో పనులు నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఖమ్మం బైపాస్ రోడ్డులో భవనం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నది.
బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను పూర్తి చేయడంలో బీసీ సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల మధ్య సమన్యయం లోపించింది. ఉన్న నిధులతో ఎంతమేరకు పనులు చేయవచ్చో ఆ పనులను కొనసాగిస్తూ అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాల్సిన రెండు శాఖల అధికారులు ఆ భవనంవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు పేరుకు మాత్రమే ఉండి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్న సదరు అమాత్యులు వారి అభివృద్ధిని మాత్రం మర్చిపోయారు. జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీల భవన నిర్మాణం పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. కాంగ్రెస్ జెండాను భుజాన మోస్తున్న బీసీ నాయకులు సైతం నోరు మెదపడం లేదు.
ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు పక్కనే ఎన్టీఆర్, తెలంగాణ తల్లి సర్కిల్‌కు దగ్గరలో నిర్మాణంలో ఉన్న బీసీ భవనం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. భవన నిర్మాణం గత ఏడాది కాలంగా నిలిచిపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇదే అదునుగా భావించిన కొందరు మినీ లారీ యజమానులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తూ అడ్డాగా మార్చారు. భవనం లోపల మద్యం సీసాలతోపాటు అశ్లీల, అసాంఘిక కార్యకలాపాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇంకొన్ని నెలలు ఇలానే వదిలేస్తే భవనం శిథిలావస్థకు చేరనున్నది.
బీసీల ఆత్మగౌరవ పతాకగా జిల్లా కేంద్రంలో నిలవాల్సిన భవనం నేడు అసంపూర్తిగా నిధుల కోసం ఎదురుచూస్తోంది. బీసీల కార్యకలాపాలు, తమ వర్గాల అవసరాలు, పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడాల్సిన భవనం అసంపూర్తి గోడలతో కనిపిస్తున్నది. తమ ఆత్మగౌరవ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వ పెద్దలతో కొట్లాడాల్సిన బీసీ వర్గాల్లో ఐక్యత లోపించిందనే చెప్పవచ్చు.
ఖమ్మంలోని బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణ మిగిలిన పనులకు టెండర్లను ప్రభుత్వం నిలిపివేసింది. సీఎం గ్యారెంటీ పథకంలో రెండు కోట్లతో పనులు జరిగాయి. మిలిగిన పనులకు అంచనాలు రూపొందించి పంపించడంతో సుడా నుంచి రూ.1.30 కోట్లు మంజూరు చేశారు. వాటికి టెండర్ల ప్రక్రియ చేపట్టే సమయంలో ప్రభుత్వ అనుమతులు లభించకపోవడంతో నిలిపివేశాం.
-మహేశ్‌బాబు, పీఆర్ డీఈ