ఖమ్మం, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని బీసీ వర్గాలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ చేసి చూపించడంపై బీసీలు భగ్గుమంటున్నారు. జనాభాలో అత్యధికులుగా ఉంటూ.. దేశ సంపద సృష్టిలో అగ్రభాగమైన బీసీల సమగ్రాభివృద్ధి, సంక్షేమం, రాజకీయ భాగస్వామ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి ఏమిటంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా తగ్గించి చూపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పలు బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకుండా ఉండేందుకే రేవంత్‌రెడ్డి సర్కారు ఈ తరహా మోసానికి పాల్పడిందని దుమ్మెత్తి పోస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ సర్కారు నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 20 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయకపోవడం అత్యంత బాధాకరమని వాపోతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక కమిషన్లు బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని సూచించినా అమలు చేయడంలో తాత్సారం ఎందుకంటూ నిలదీస్తున్నారు.
అలాగే మహిళా రిజర్వేషన్ల అంశంలో రాజకీయ ఎత్తుగడలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. వాటిల్లో బీసీ కోటాను తక్షణమే ప్రకటించాలని, లేదంటే అన్ని జనరల్ కేటగిరీలకు వెళ్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోనట్లయితే బీసీల దెబ్బ రుచి చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ తమను ఓటు బ్యాంకుగానే పరిగణించారని, ఇక ముందు వాళ్ల ఆటలు సాగనివ్వబోమని తెగేసి చెబుతున్నారు. కులగణన శాస్త్రీయంగా జరగాలని, దాని ప్రకారమే రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను తక్కువ చేసి చూపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కోణం ఉంది. కాపులు, యాదవులు, కురుమలు, గౌడ్లు, పద్మశాలీలు, రజకులు, కుమ్మరి, నాయీబ్రాహ్మణులు ఇలా చాలా కులాల సంఖ్య ఎక్కువగా ఉంటే తక్కువ చేసి పాత జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని డీలిమిటేషన్ పేరుతో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోంది. తప్పుత తడకలుగా చేసిన కులగణన ముమ్మాటికీ తప్పే. ఇది కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న కుట్రలో భాగమే అవుతుందనేది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీపై అసమ్మతి పెరుగుతుంటే మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తీసుకొచ్చి జిమ్మిక్కులు చేస్తోంది.
-వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి, కొత్తగూడెం
పాత జనాభా లెక్కలతో కులగణన చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది. తప్పుడు లెక్కలు చూపి డీలిమిటేషన్లో కొత్త నియోజకవర్గాలు రాకుండా చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలో భాగమే ఇది. పేరుకే లెక్కలు తీశారు కానీ పాత లెక్కల ప్రకారమే మాకు పర్సంటేజీ కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై ఎందుకింత వివక్ష చూపుతోంది. 2026 జనాభా లెక్కల ప్రకారం గణన చేస్తే మా లెక్కలు తేలుతాయి.
-పామర్తి అంకినీడు ప్రసాద్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తగూడెం
రాష్ట్రంలోనే రెండో స్థానంలో బీసీలకు ఎక్కడా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని కులాల్లో బీసీ జనాభా మొదటి స్థానంలో ఉంది. అయినా ఏనాడూ ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదు. మహిళా రిజర్వేషన్ అంటారు కానీ కనీసం మహిళలకు కూడా సీట్లు కేటాయించడం లేదు. గణన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అన్ని విధాలా మోసం చేస్తున్నాయి.
-కొవడగాని శ్రీనివాస్ యాదవ్, బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్, భద్రాద్రి జిల్లా
బీసీల జనాభా సగానికి పైగా ఉన్నా కాకి లెక్కలు చెప్పి ప్రభుత్వం నిజాలు దాచి పెట్టాలని చేస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్లు, నిధులు వచ్చేలా చూడాల్సిన పాలకులు అసలు లెక్కలు దాచి పెట్టడం సరైంది కాదు. ప్రభుత్వం బీసీల గణన విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే వారికి న్యాయం జరిగినట్లు అవుతుంది. ఉప కులాలు కలిగిన అనేక మంది ఉన్న బీసీల విషయంలో అన్యాయం చేయొద్దు. ఒకవేళ అన్యాయం జరిగితే బీసీల సంఘాల తరఫున ఉద్యమాలకు సిద్ధమవుతాం.
-బొడ్డు నరేందర్, జీళ్ళచెరువు, కూసుమంచి మండలం
ప్రభుత్వాలు బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నాయి. చట్టసభలు, ఇతర విషయాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని చూడటం సరికాదు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో బీసీల జనాభా 60 శాతం ఉండగా.. కాంగ్రెస్ హయాంలో 42 శాతం అని చూపించడం ఎంత వరకు సబబు. జస్టిస్ బీపీ మండల్ కమిషన్, కాకా కలేల్కర్ కమిషన్, తెలంగాణలోని మురళీమనోహర్ కమిషన్లు అన్నీ బీసీలకు రాజకీయంగా 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని సూచించాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నం. మహిళా రిజర్వేషన్లలో బీసీ ఉప కోటాను ప్రకటించాలి. లేదంటే స్థానాలన్నీ జనరల్‌కే వెళతాయి. అదే జరిగితే బీసీలకు రాజకీయంగా ప్రాముఖ్యత లేకుండా పోతుంది.
– మేకల సుగుణారావు, న్యాయవాది, బీసీ సెల్ ఖమ్మం నగర అధ్యక్షుడు
బీసీ జనాభా లెకలు తప్పుల తడకలుగా ఉన్నాయి. కులగణన సక్రమంగా చేపట్టి బీసీ కులాల్లో ఉన్న అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించాలి. ఇలా చేయడం వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉండదు. స్పష్టమైన లెకలు చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బీసీ వర్గాలను మభ్య పెట్టకుండా.. టాపిక్‌ను డైవర్షన్ చేయకుండా అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలి. లేకపోతే భవిష్యత్‌లో బీసీ వర్గాలందరూ ఉద్యమాలు చేపట్టాల్సి వస్తోంది.
-చెక్కిలాల మోహన్‌రావు, విద్యావంతుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు, పెనుబల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నాయి. బీసీల గణన, రిజర్వేషన్ల అమలు విషయంలో తప్పుడు విధానాలు పాటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన జనాభా లెక్కల్లో మున్నూరు కాపులను సంఖ్యాపరంగా తక్కువ చేసి చూపించడం వల్ల ఆయా వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అలాగే బీసీల విషయానికి వస్తే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 శాతం కూడా అమలు చేయలేకపోయింది. ఇది ముమ్మాటికీ బీసీలను అవమానించడమే అవుతుంది. బీసీల జనాభా, రిజర్వేషన్ల అమలు గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి న్యాయం చేయాలి.
– గుండాల కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నేత, ఖమ్మం
బీసీ జనాభా విషయంలో ప్రతీ కులానికి ఉన్న లెక్కలు సక్రమంగా ప్రకటించాలి. జనాభాను తక్కువ చేసి చూపించాలని చూస్తే సహించేది లేదు. 50 శాతంపైగా ఉన్న బీసీల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్న బీసీలను ఇంకా అణగదొక్కాలని చూడటం సరికాదు. బీసీల కులాల విషయంలో ప్రభుత్వం లెక్కలు తక్కువగా చేసి చూపిస్తే వారిని అవమానించడమే అవుతుంది. జనాభా ప్రాతిపదికన అన్ని పంపకాలు సక్రమంగా చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది.
-కాసాని సైదులు, నాయకన్‌గూడెం, మాజీ సర్పంచ్ కూసుమంచి మండలం
బీసీ జనాభాను తక్కువ చేసి చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తోంది. కులగణన నివేదిక వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉంది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వేలో మున్నూరు కాపులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 లక్షల మంది ఉంటే.. తాజాగా రేవంత్‌రెడ్డి సర్కార్ జనగణన నివేదికలో కేవలం 13 లక్షల మంది ఉన్నట్లు చూపింది. ఎనిమిదేళ్ల కాలంలో పెరగాల్సిన మున్నూరు కాపు జనాభా ఏకంగా సగం మందికి పైగా ఎలా తగ్గారో ప్రభుత్వానికే తెలియాలి. ఈ నివేదికను బీసీ వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు.
-యూఎస్ ప్రకాశ్‌రావు, మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కో-ఆర్డినేటర్, అశ్వారావుపేట
గత జనాభా లెక్కలనుబట్టి రాష్ట్రంలో 32 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని గత ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కులగణన ప్రకారం 14 లక్షల మందినే చూపుతోంది. అంటే.. మున్నూరు కాపు కులం బలహీన వర్గాలలో అతి పెద్ద కులం. దాని ఉనికిని తగ్గించేందుకు అగ్రకుల నాయకులు చేస్తున్న కుట్ర ఇది. వెంటనే రాష్ట్రంలో కులగణనపై నిజమైన లెక్కలు బయటపెట్టాలి.
-పింగళి నరేశ్, మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షుడు, ఇల్లెందు
ఉమ్మడి రాష్ట్రంలో కోటి జనాభాకు చేరువలో ఉన్న ముదిరాజ్‌లు తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రస్తుతం 45 లక్షల వరకు ఉంటారని.. రాజ్యాధికారం దక్కకుండా చేసేందుకు ఇలా గణాంకాలు తక్కువ చేసి చూపడం ప్రభుత్వానికి సరికాదు. రాష్ట్రంలో బీసీ కులాల సర్వే అసంబద్ధంగా ఉండటమే దీనికి కారణం. బీసీ ‘డీ’లో ఉన్న ముదిరాజ్లతోపాటు మరికొన్ని కులాలు కలిపి 20.12 శాతంగా ఇప్పుడున్న గణాంకాలు చూపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్‌లు ఒక్కరే మొత్తం 10 శాతానికి పైగా ఉంటారు.
-మహంకాళి రామారావు, ముదిరాజ్, ఇరవెండి, బూర్గంపహాడ్ మండలం
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మేదర కులస్తులు లక్ష మంది వరకు ఉన్నారు. కానీ, ప్రభుత్వం వెల్లడించిన కులగణన లెక్కల్లో 30 శాతానికి తగ్గించి చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. గత ప్రభుత్వ సర్వేలో ఎక్కువగా ఉన్న బీసీ కులాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి చూపడం ఎంతవరకు సబబు. ప్రభుత్వం అసలైన కులగణన వివరాలు బయటపెట్టాలి. అన్ని కులాలకు సమ న్యాయం చేయాలి.
-సిలివేరి సత్యనారాయణ, మేదర కుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఇల్లెందు
సర్వే గణాంకాల్లో మున్నూరు కాపు కుటుంబాలను తగ్గించి చూపడం అన్యాయం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షలకు పైగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం 13 లక్షలు ఉన్నట్లు చూపడం దారుణం. ప్రభుత్వం కావాలనే సంఖ్యను తగ్గించి చూపిందా? లేదా సర్వే నిర్వహణలో లోపాలు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. బీసీలను అన్ని విధాలా అణగదొకేందుకే ప్రభుత్వం ఇలాంటి అరకొర సర్వేలను ముందుకు తీసుకొస్తోంది. సంక్షేమ పథకాల్లో కోతలు, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో బీసీలకు తీవ్ర నష్టం కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు.
-రంగిశెట్టి కోటేశ్వరరావు, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకుడు, మధిర
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే అంతా అబద్ధాల పుట్ట. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో గౌడ కులస్తుల జనాభా సుమారు 30 లక్షలకు పైబడి ఉంటే.. ప్రభుత్వం కేవలం 16 లక్షల మందిని మాత్రమే చూపించడం విడ్డూరంగా ఉంది. గౌడ కులస్తులకు రాజ్యాంగపరమైన హకులు, సంక్షేమ ఫలాలు అందకుండా చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తూ, బీసీలను అన్ని రంగాల్లో అణగదొకడమే లక్ష్యంగా పెట్టుకుంది.
-బంధం నాగేశ్వరరావు, గీత పనివారల సంఘం రాష్ట్ర నాయకుడు, బోనకల్లు
2014 సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు అసంబద్ధంగానే ఉన్నాయి. బీసీ జనాభా శాతం ముస్లింలతో కలిసి 56.33 శాతంగా లెక్క చూపింది. అయితే ముస్లింలు కాకుండానే బీసీ జనాభా 51 శాతానికి పైగానే ఉంటుంది. రాజకీయంగా బీసీ కులాలను దెబ్బతీసేందుకు హడావుడిగా గణాంకాలు వెల్లడించి బీసీలకు అభ్యంతరం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
-బెజ్జంకి కనకాచారి, విశ్వబ్రాహ్మణ కులస్తుడు, సారపాక, బూర్గంపహాడ్ మండలం