ఢిల్లీలో జరిగిన సీజేపీ ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంపై కేంద్రం చేపట్టిన నిర్బంధం మరోసారి దేశంలోని స్థితిగతులపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ విద్యార్థులు, యువకులు డిమాండ్ చేస్తే, చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం.. అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడింది. విద్యార్థుల వీరోచిత పోరాటానికి చలో పార్లమెంట్ వేదికగా నిలిచింది, నిర్బంధాలకు వెనుతిరగలేదు, న్యాయమైన డిమాండ్లను సాధించేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.
నీట్ పరీక్షలో జరిగిన తప్పుల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లక్షలాది విద్యార్థులు నష్ట పోయారు. కోట్లాది కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం సంవత్సరాల తరబడి కష్టపడుతుంటే, ఒక పరీక్షలో జరిగిన అవకతవకతో వారి కలలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇది కేవలం ఒక పరీక్షలో జరిగిన తప్పిదం కాదు. దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై పడిన మచ్చ. నైతిక బాధ్యతతో వ్యవహరించి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోట్లాది మంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రధాన మంత్రి స్పందించకపోవడం దారుణం. దీంతో విద్యార్థులు, యువతీ యువకులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చలో పార్లమెంట్ నిర్వహించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలానే అణచివేతనే అస్త్రంగా ఎంచుకున్నది. కొన్నేండ్లుగా రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు నిరసన తెలిపినా ముందుగా ఎదురయ్యేది పోలీసులు, బారికేడ్లు, అరెస్టులే. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రజల ప్రశ్నలకు బారికేడ్లు సమాధానం కావు. విద్యార్థుల భవిష్యత్తుకు మౌనం పరిష్కారం కాదు. పాలకులు నిర్బంధ రాజకీయాలను విడనాడాలి.
2011లో రాంలీలా మైదానంలో యూపీఏ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేసిన దీక్షకు అప్పటి ప్రతిపక్ష బీజేపీ మద్దతు తెలిపింది. కానీ నేడు పాలకపక్షమైన బీజేపీ వైఖరి మారింది. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు రైతులు చేసిన సుదీర్ఘ పోరాటాన్ని బీజేపీ ప్రభుత్వం అణచివేయాలని చూసింది. రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు బీజేపీ అనుకూలవర్గం కుట్ర చేసింది. విద్యార్థుల ఉద్యమాన్ని కూడా అదే విధంగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్లపై బీజేపీ నేతలు బురద చల్లే ప్రకటనలు చేస్తున్నారు.
ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రెండు పార్టీలు, విఫలమయ్యాయి. ఢిల్లీలో, గల్లీలో దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ శక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే సీజేపీ ఇచ్చిన పిలుపులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఆధిపత్య రాజకీయ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. విద్యార్థులపై కేంద్రం అణచివేతను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేయడం విడ్డూరం. హామీలను అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగుతున్న పోరాటాలను నిర్బంధాలతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వారిపై దుర్భాషలు, దుష్ప్రచారం చేయిస్తున్నది. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయని కాంగ్రెస్ నిరసన నవ్వులపాలు కాక తప్పదు. చివరకు సభలకు అనుమతి ఇవ్వకుండా, కనీసం నిరసన తెలిపై హక్కును హరించి వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఢిల్లీ ఘటనపై మాట్లాడాలి. ప్రజల, విద్యార్థుల ఉద్యమంగా ప్రారంభమైన పోరాటాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ హైజాక్ చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నట్టు కనిపిస్తున్నది.
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం లక్ష్యం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైన అధికార పక్షం, ప్రతిపక్షం రెండింటినీ ప్రజల ముందు జవాబుదారులుగా నిలబెట్టడమే. అయితే మొన్నటి పరిణామాల తర్వాత ప్రజల సమస్యలు, ప్రజా జవాబుదారీతనం వంటి అసలు అంశాల కంటే రాజకీయ ప్రదర్శనలు, పరస్పర విమర్శలే ప్రధాన చర్చగా మారాయి. ప్రజల ఉద్యమాన్ని పార్టీల మధ్య రాజకీయ పోటీగా కుదించడానికి కారణమైనందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరిపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో బలమైన రాజకీయ వ్యవస్థలను సైతం కుదిపేశాయి. అలాంటి ప్రజా ఉద్యమాల శక్తే అధికార పక్షానికైనా, ప్రధాన ప్రతిపక్షానికైనా ఆందోళన కలిగించే అంశమై ఉండవచ్చు కానీ చరిత్రను గమనించి ముందుకు సాగకుంటే జవాబు చరిత్రే చెప్తుంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు కొంత మంది యువకులు ముందుయుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని జంతర్‌మంతర్‌లో జనగానం మార్మోగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరు, ప్రజల గొంతు నొక్కలేరు.