హైదరాబాద్, జులై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీలో మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఉద్యమంలో మహిళలు పాల్గొనలేదా? అని ఎంపిక కమిటీ చైర్మన్ కే కేశవరావు, ఇతర కమిటీ సభ్యులను మహిళలు నిలదీశారు. గురువారం ఉద్యమకారుల కమిటీ సమావేశంలో తమ అభిప్రాయాలు తెలుపడానికి పలువురు మహిళలు హాజరయ్యారు. కమిటీ ఎదుట మాట్లాడటానికి కూడా తమకు అవకాశమివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో చైర్మన్ కే కేశవరావు అసహనానికి గురై సమావేశం నుంచి రెండుసార్లు బయటికెళ్లి తిరిగొచ్చారు. అయి నా శాంతించని మహిళలు ప్రశ్నలవర్షం కురిపించసాగారు. దీంతో అల్లరి చేయొద్దు, మీడి యా సమావేశం ఉన్నదంటూ వారిపై అగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో మహిళ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కేశవరావు వెల్లడించారు.