ఖమ్మం, అక్టోబర్ 9 : సంసృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం ప్రకృతి పండుగ బతుకమ్మ అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఎనిమిదో రోజు బుధవారం సాయంత్రం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని ప్రజలతో కలిసిమెలిసి ఆడి వారిని ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదిరోజులపాటు గౌరమ్మను కొలుచుకొంటూ బతుకమ్మలు పేర్చి ఆడుతూపాడుతూ మహిళలు సంబురంగా నిర్వహించుకునే గొప్ప పండుగ అని అన్నారు. బతుకమ్మ వేడుకల్లో జిల్లాలోని వివిధవర్గాల మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు.
స్టేడియంలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…. అంటూ ఆట పాటలతో సందడి చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధశాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయం(తెలంగాణ భవన్)లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉద్యమకారులు బిచ్చాల తిరుమలరావు, నాయకులు కొల్లు పద్మ పాల్గొన్నారు.