మామిళ్లగూడెం, అక్టోబర్ 7 : బతుకమ్మ అంటే.. మహిళలు, యువతులు సేకరించిన తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతారు. సందడి చేస్తారు. కానీ.. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఆ శాఖ కార్యాలయ ప్రాంగణంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి సే.. నో డ్రగ్స్ అంటూ ప్లకార్డులు చేబూని వినూత్న రీతిలో బతుకమ్మలు పేర్చారు.
సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే సంకల్పంతో సే.. నో డ్రగ్స్ అంటూ పూలతో తయారు చేసిన బతుకమ్మలను తయారు చేసి ఆడిపాడారు. డయల్-1098ను పూలతో తీర్చిదిద్ది మంచి సందేశాన్ని అందించారు. బతుకమ్మల రూపంలో మంచి సందేశాన్ని అందించిన సిబ్బందిని ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మహిళా అధికారులతోపాటు సహాయ కమిషనర్ గణేశ్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.