‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్కా బతుకమ్మా.. దాదీ మా బతుకమ్మా.. దామెర మొగ్గల బతుకమ్మా..’ అంటూ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలందరూ ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే బతుకమ్మ వేడుకలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నాలుగో రోజైన శనివారమూ ఘనంగా కొనసాగాయి. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మలను ఎత్తుకొని ఆడబ్డిడలందరూ సందడి చేశారు. రెండు జిల్లాల్లో అన్ని గ్రామాల్లోనూ బాలికల నుంచి బామ్మల దాకా, యువతుల నుంచి మహిళల దాకా వయోభేదం లేకుండా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
చప్పట్లు, కోలాటాలు, నృత్యాలతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వేడుకలు కూడా జరుగుతున్నాయి. శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ వేడుకలు జరిగాయి.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉద్యోగి నులు, మహిళలు బతుకమ్మలను పేర్చుకొని తీసుకొచ్చారు. సాయంత్రం జడ్పీ ఆవరణలో జరిగిన పూల పండుగ వేడుకల్లో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి సహా మహిళా అధికారులు నెత్తిన బతుకమ్మలతో హాజరయ్యారు. ఉద్యోగినులు, స్థానిక మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత గౌరమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
– ఖమ్మం, అక్టోబర్ 5