ఖమ్మం, సెప్టెంబర్ 16: టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావు నివాసానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం వెళ్లిన ఆమె.. సాంబశివరావు కుటుంబ సభ్యులను పలుకరించారు. అతడి సతీమణికి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కొణిజర్లలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తన విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సాంబశివరావుపై ఇటీవల రేవంత్ ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తుతున్న పాత్రికేయులపైనా, సోషల్ మీడియా యాక్టివిస్టులపైనా, సామాజిక కార్యకర్తలపైనా అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. సాంబశివరావు కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు మందడపు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, సెప్టెంబర్ 16: ప్రజలు, రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని కల్లూరు, పెనుబల్లి ప్రెస్‌క్లబ్‌ల బాధ్యులు, పాత్రికేయులు విమర్శించారు. ఇటీవల కొణిజర్లలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కల్లూరు ప్రెస్‌క్లబ్ బాధ్యులు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌కు, పెనుబల్లి ప్రెస్‌క్లబ్ బాధ్యులు తహసీల్దార్ నారాయణమూర్తికి మంగళవారం వినతిపత్రాలు సమర్పించారు. పాత్రికేయులు మునాఫ్, వేము రాంబాబు, చంటి, నల్లమల అరుణ్ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.