రఘునాథపాలెం, మార్చి 12: ఖమ్మం అంబేద్కర్ భవన్లో గురువారం వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తొలుత భూదాన్ భూముల్లో వారు నిర్మించుకున్న ఇండ్లను గత నెల 24న నేలమట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిని, సామాన్లను అక్కడి నుంచి తీసుకొచ్చి ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్‌లోని పునరావాస కేంద్రాల్లో పడేసింది. ఇన్ని రోజులూ బీఆర్ఎస్ నేతలు అందించిన అన్నపానీయాలు మినహా ప్రభుత్వం నుంచి కనీస ఆదరణ కరువైంది. ఎప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న ఆశతో, గూడు కోల్పోయిన తాము మరెక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలోనూ అక్కడే పడి ఉన్నారు.
బాధితుల ఆందోళన, బీఆర్ఎస్ పోరాట ఫలితంగా దిగివచ్చిన ప్రభుత్వం అర్హులకు భూదాన్ భూముల్లో 75 గజాల చొప్పున స్థలం , ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. మొత్తం 750 ఇండ్లను కూల్చిన ప్రభుత్వం.. బుధవారం 311 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. మరో 101 మందికి వారి స్వగ్రామాల్లో స్థలాలు ఇస్తామని, ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పింది. 750 కుటుంబాలకు 412 మంది లెక్కతేల్చిన ప్రభుత్వం.. మిగిలిన 338 మంది గురించి ప్రస్తావించలేదు. జాబితాలో పేర్లు లేకపోవడంతో వారంతా అనర్హులేనన్న ముద్ర వేసింది. వారిని గురువారం అంబేద్కర్ భవన్, టీటీడీసీల్లోని పునరావాస కేంద్రాల నుంచి వెళ్లగొట్టింది.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పారిశుద్ధ్య ట్రాక్టర్లలో బాధితుల సామాన్లు వేసి పంపించేసింది. దీంతో ఆ 338 మంది బాధితులు అధికారుల ఎదుట గుండెలు బాదుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. పునరావాస కేంద్రం నుంచి సామాన్లు తీసుకొని వెళ్లకపోతే కేసులు పెట్టించి జైళ్లలో వేయిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దిక్కుతోచని స్థితిలో కన్నీటిని దిగమింగుకుంటూ కొందరు బాధితులు తాము తెచ్చుకున్న ఆటోల్లో సామాన్లు ఎక్కించుకొని ‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా.. ముల్లె సదురుకున్న ఎల్లిపోతావున్న.. ఈ ఊల్లె నాకింక ఏమున్నదక్కా..’ అంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు. గూడు చెదిరిన పక్షుల్లా..
తొలుత వెలుగుమట్ల భూదాన్ భూముల్లోంచి, ఇప్పుడు పునరావాస కేంద్రాల్లోంచి రేవంత్ సర్కార్ గెంటేయడంతో బాధితులంతా గూడు చెదిరిన పక్షులయ్యారు. ఇన్నాళ్లూ పునరావాస కేంద్రంలో చెట్ల కింద ఉన్న నిరుపేదలను.. ఇప్పుడు అక్కడి నుంచి కూడా వెళ్లగొట్టడంతో ఆర్తనాదాలతో బయటకు వెళ్లిపోయారు. న్యాయం చేస్తామంటూ ఇప్పటిదాకా నమ్మించిన ప్రభుత్వం.. మళ్లీ అన్యాయం చేయడంతో బరువెక్కిన గుండెలతో బయటకు నడిచారు.
తామూ కటిక పేదలమని, అయినా తమ పేర్లు జాబితాలో లేవని రోదించినా, మొరపెట్టుకున్నా ప్రభుత్వం కనీసమాత్రంగానూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కార్ ఆదేశాల మేరకు అంబేద్కర్ భవన్‌కు వచ్చిన అధికారులు కనికరం లేకుండా ప్రవర్తించారు. ప్రభుత్వ ఆదేశాలున్నందున ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. లేకుంటే కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేశారు.

ఖమ్మం అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ బాధితులను పోలీసు, రెవెన్యూ అధికారులు గురువారం బలవంతంగా వెళ్లగొట్టారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసి సామాన్లు సహా వారిని బలవంతంగా తరలించారు. మొదట పట్టాలురాని పేదలు అధికారుల తీరుపై తిరగబడ్డారు. ఉండటానికి నిలువ నీడ లేకుండా చేసి ఇప్పుడు బలవంతంగా వెళ్లగొడితే సామాన్లతోపాటు తాము ఎక్కడికి వెళ్లాలంటూ నిలదీశారు. న్యాయం చేసే వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ అధికారులు వినలేదు. అంబేద్కర్ భవనంలో ఉన్న సామగ్రిని తీసుకొని వెళ్లిపోకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దిక్కుతోచని స్థితిలో పేదలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఫొటోలో తన ఇద్దరు పిల్లలను చూపుతూ రోదిస్తున్న వ్యక్తి పేరు మట్టా నరేశ్. వెలుగుమట్ల భూదాన్ బాధితుడు. ప్రేమ వివాహం చేసుకున్న నరేశ్.. కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో తొమ్మిదేండ్ల క్రితం వెలుగుమట్ల గుట్టల్లోని భూదాన్ భూముల్లో గుడిసె నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు. తన ఇద్దరు పిల్లలు కూడా అక్కడే జన్మించారు. తనకు మరెక్కడా ఇంటి స్థలం లేదని వాపోయాడు. అధికారులేమో అర్హుల జాబితాలో తన పేరు లేదంటున్నారంటూ వాపోయాడు. తన పేరుతో గానీ, తన కుటుంబ సభ్యుల పేరుమీద గానీ మరెక్కడా ఇంటి స్థలంగానీ, ఇల్లుగానీ లేదని నెత్తీనోరు బాదుకున్నాడు. ఒకవేళ ఉన్నదని ప్రభుత్వం చూపిస్తే అక్కడికే వెళ్లి ఇల్లు కట్టుకొని ఉంటానంటూ భోరున విలపిస్తూ చెప్పాడు.

ఈ ఫొటోలో ఇంటి ముందు నిలుచున్న మహిళ పేరు సోమా ఉమారాణి. భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకొని బతుకుదెరువు కోసం కిరాణం షాపు నడుపుకొంటూ ఎనిమిదేండ్లుగా జీవిస్తున్నది. గత నెల 24న ప్రభుత్వం పంపిన బుల్డోజర్లు ఈమె ఇంటిని నేలమట్టం చేసి గూడులేకుండా చేశాయి. మంత్రులు బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో భూదాన్ బాధితులకు అందించిన పట్టాల్లో ఉమారాణి పేరులేదు. అదేమిటని అధికా రులను ప్రశ్నిస్తే.. ‘నీకు అసలు భూదాన్ భూ ముల్లో ఇల్లే లేదు’ అంటూ సమాధాన మిచ్చారు. ‘అసలు విచారణకు రాకుండానే ఇల్లు లేదంటే ఎలా? బాధితురాలినే కాదంటే ఎలా అంటూ ఉమారాణి కన్నీరుమున్నీరైంది.

ఈ ఫొటోలోని మహిళ పేరు వల్లభనేని ప్రమీల. ప్రభుత్వం కూల్చకముందు భూదాన్ భూముల్లో తాను నిర్మించుకున్న ఇంటిముందు తీసుకున్న ఫొటో ఇది. ఈ ఫొటోను చూపుతూ ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద గురువారం ఆమె కన్నీటి పర్యంతమైంది. కూలి పనులు చేసుకొని రూ.10 లక్షలు కూడబెట్టి కట్టుకున్న ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా కూల్చివేసిందని వాపోయింది. ఇప్పుడేమో అనర్హురాలునంటూ పూర్తిగా వెళ్లగొడుతున్నారంటూ గుండెలు బాదుకున్నది. న్యాయం చేస్తామంటే అనేక పర్యాయాలు అధికారులకు ఆధార్‌కార్డులు ఇచ్చానని చెప్తున్నది. ఎలాంటి విచారణ చేయకుండానే తాను అనర్హురాలునంటున్నారని, తనను ఇక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని కన్నీటిపర్యంతమైంది.

అంబేద్కర్ భవన్లో ఉన్నోళ్లంతా ఇండ్లు కూల్చేస్తే వచ్చినోళ్లే. పట్టాలు పొందిన వారిలో కొందరు అనర్హులు ఉన్నారు. మున్సిపల్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్లకే పట్టాలు ఇచ్చారు. భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లంతా ఇక్కడే ఉన్నారు. మేమే అసలైన భూదాన్ బాధితులం. ప్రభుత్వం సర్వే చేసి అసలైన బాధితులకు న్యాయం చేయాలి.
– దుగ్గిరాల మంజుల, బాధితురాలు

న్యాయం చేయకుంటే ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదు. కష్టపడి కట్టుకున్న ఇంటిని నిట్టనిలువునా కూల్చివేసి మమ్మల్ని రోడ్డునపడేశారు. ఇప్పుడేమో అంబేద్కర్ భవనం నుంచి వెళ్లిపోవాలంటున్నారు. పోలీసులు మా సామాన్లను తీసి ఆటోలో వేసి పంపిస్తుంటే రోడ్డు పక్కన దింపుకొన్నా. ఇప్పుడు ఎక్కడి పోవాలి? ప్రజాప్రభుత్వమంటే ఇదేనా?
– సంక్రాంతి కృష్ణ, బాధితుడు

సర్వేకు వచ్చినప్పుడు మా వద్ద ఉన్న ఇంటి ఆధారాలు కూడా చూడలేదు. కనీసం వాటి గురించి అడుగలేదు. ఇండ్లు కూల్చినట్టుగా ఎలాంటి ఆధారాలు లేని వాళ్లకు బుధవారం పట్టాలు ఇచ్చారు. కానీ గడిచిన పదేండ్లుగా అక్కడే ఉంటున్నాం. ఇంటి బిల్లులు కట్టాం. కరెంటు మీటర్లు పెట్టుకున్నాం. ఇంటికి కొంత డబ్బులు పోగేసుకొని కరెంటు స్తంభాలూ వేసుకున్నాం. కానీ ఇప్పుడేమో మమ్మల్ని అనర్హులంటున్నారు. వెళ్లగొడుతున్నారు. పదేండ్లుగా అక్కడే ఉంటున్న మేం అనర్హులమెలా అయ్యాం?
– కణతాల పుల్లమ్మ, బాధితురాలు