– ఓటరు నమోదు, అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పరిశీలన
జూలూరుపాడు, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, క్లస్టర్ స్థాయి ప్రత్యేక అధికారి బి.నాగలక్ష్మి మంగళవారం జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మాచినపేట తండా, అన్నారుపాడు, పాపకొల్లు గ్రామాల్లో కొనసాగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’SIR కార్యక్రమం అమలు తీరును ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లతో నేరుగా మాట్లాడి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ, క్లస్టర్ స్థాయి అధికారులు ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
అనంతరం మండల పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైన్లు, ఇంగుడు గుంతలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్య మెరుగుదలకు ఈ పనులు ఎంతో దోహద పడతాయని, ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని సూచించారు. పాపకొల్లు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రావెల్ రోడ్డును ఆమె స్వయంగా పరిశీలించి, రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అనంతరం జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండలంలో విస్తృతంగా మొక్కలు నాటాలని, కేవలం నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటన ముగిసిన తర్వాత మండలంలో కొనసాగుతున్న పలు ప్రగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా ప్రారంభం కాని ప్రగతి పనులను తక్షణమే మొదలుపెట్టాలని, ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పనులను నాణ్యతతో, నిర్దేశిత కాలపరిమితిలోగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసి రామ్, ఏపీవో రామారావు, పంచాయతీ రాజ్ ఏఈ నవీన్ కుమార్, స్థానిక గ్రామ పంచాయతీల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

జూలూరుపాడు మండలంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి విస్తృత పర్యటన