టేకులపల్లి, జూన్ 4 : సామాజిక స్పృహతో తమ వంతు ప్రయత్నంగా యువకులు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ఆర్ వి బి ఎస్ అమ్మ ట్రూత్ సొసైటీ చైర్మన్ బానోత్ విజయ, కార్యదర్శి భానోత్ రమేశ్ లను గుమ్మడి అభినందించారు. టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక తండా గ్రామంలో గురువారం ఆర్ వి బి ఎస్ అమ్మ ట్రూత్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పలకలు, బలపాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మడి నరసయ్య పాల్గొని చిన్నారులకు పలకలు, బలపాలను పంపిణీ చేశారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులు మొత్తం 6,300 మందికి ఈ పలకలను ఉచితంగా అందజేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి రమేశ్ తెలిపారు.
గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ రమేశ్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం చేస్తూ తన వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమాలను ఇదే విధంగా కొనసాగిస్తూ ముందు ముందు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన కోరారు. అంతకుముందు గుమ్మడి నరసయ్యను శాలువాతో సత్కరించారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ ఈసం నీలమయ్య, అంగన్వాడీ టీచర్ మాలతి, ఆయాలను సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా టేకులపల్లి మండల కార్యదర్శి ధర్మపురి వీరబ్రహ్మచారి, నాయకులు జరుపుల సుందర్, బానోతు లింగ, పంతులు, మాజీ సర్పంచ్ ఈసం నీలమయ్య, గ్రామస్తులు గుగులోతు వెంకన్న, గుగులోతు విజయ్ పాల్గొన్నారు.