రామవరం, డిసెంబర్ 05 : బాల బాలికలు, యువతీ యువకులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఎం.పరంధామరెడ్డి అన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు గెలుపొంది ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా రిజర్వేషన్ ద్వారా ఉన్నత చదువులకు, ఉద్యోగాలు పొందాలన్నారు. జనవరి 5 నుండి 9వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్‌లో జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన కాకతీయ యూనివర్సిటీలో B.ped ద్వితీయ సంవత్సరం చదువుతున్న క్రీడాకారుడు యాసం జంపన్న ఎంపికయ్యాడు.
ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ యూనివర్సిటీ రెజ్లింగ్ పోటీల్లో 86 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి ఆల్ ఇండియా యూనివర్సిటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. పోటీలకు ఎంపికైన సందర్భంగా శుక్రవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారిని మర్యాదపూర్వకంగా కలవగా ఆయన అభినందనలు తెలియజేశారు. జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ పి.కాశీ హుస్సేన్ వద్ద జంపన్న శిక్షణ పొందుతున్నాడు.