– విద్యా హబ్‌గా మారనున్న కొత్తగూడెం జిల్లా కేంద్రం
– రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో యంగ్ ఇండియా స్కూల్
– కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూన్ 29 : ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక కీర్తి పతాక అని, ఈ స్కూల్ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లా కేంద్రం గొప్ప విద్యా హబ్’గా మారబోతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ‘యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల’ నిర్మాణ పనులను సోమవారం అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకూ ఒకే క్యాంపస్ లో విద్యను అందించాలనే ప్రభుత్వ ఆలోచన ఎంతో అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగూడెం క్యాంపస్ లో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత అత్యాధునిక హంగులతో ఈ స్కూల్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. 25.475 ఎకరాల భారీ విస్తీర్ణంలో, 5,38,246 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో నిర్మిస్తున్న ఈ భారీ నిర్మాణాల్లో అకడమిక్ బ్లాక్, జూనియర్, సీనియర్ హాస్టల్ బ్లాకులు, డైనింగ్, కిచెన్ లతో పాటు సిబ్బంది కోసం క్వార్టర్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ సరికొత్త స్కూల్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్దేశించుకొని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ సెంటర్లు, సైన్స్ ల్యాబ్‌లు, 5000 పైగా పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ కోర్టులను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, పర్యావరణ హితంగా ఉండేలా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సౌర, పవన విద్యుత్ వ్యవస్థలను, నీటి సంరక్షణ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానాలను ఇక్కడ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, ఇప్పటికే రోడ్లు, బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు, ఓవర్ బ్రిడ్జీలు, ఔటర్ రింగు రోడ్లు కొన్ని నిర్మాణ దశలో ఉండగా, మరికొన్నింటికీ మంజూరు లభించిందని తెలిపారు.
అన్ని కులాలవారికి 17 కమ్యూనిటీ హాలు మంజూరు చేయడం జరిగిందని, ఎయిర్‌పోర్టు, అంతర్జీతీయ క్రికెట్ స్టేడియం, క్రీడా మైదానాలు, జిమ్ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు శక్తివంచ లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, డీఈఓ వాసంతి, పాఠశాలల భవనాల పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వర్ రావు, వివిధ శాఖల అధికారులు హేమచంద్ర రావు, రాజగోపాల్, నాయకులు వాసిరెడ్డి మురళి, యూసుఫ్, ధర్మరాజు, కార్పొరేటర్లు ఎర్రబెల్లి శంకర్, దుర్గ, సుధాకర్, పద్మ, ఆకాంక్ష, హిమశ్రీ, బండి నర్సింహా, విజయ్, తులశమ్మ, సహేరా, కళావతి పాల్గొన్నారు.