కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 29 : ఆర్టీసీ సంస్థపై ప్రయాణీకులకు అపారమైన నమ్మకం ఉందని, అందుకే ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చినా ఆర్టీసీకి ఆదరణ తగ్గడం లేదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సంస్థలోని సిబ్బంది, ఉద్యోగులు, డ్రైవర్లు పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ అన్నారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొత్తగూడెం ఆర్టీసీ డీఎం యు.రాజ్యలక్ష్మీ సోమవారం జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా ‘యాత్రా దానం’ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
భక్తులు తీర్ధ యాత్రలకు వెళ్లాలనుకున్నప్పటికీ వారి ఆర్థిక స్థితి బాగలేక వెళ్లలేకపోయిన వారికి, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహకారాలు, స్పాన్సర్షిప్ చేస్తే వారందరిని తీర్ధయాత్రకు తీసుకు వెళ్లడమే ‘యాత్రా దానం’ ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ కు ఆర్టీసీ డీఎం వివరించారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిన కార్గో పార్సిల్ ను కలెక్టర్‌కు ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్గో ఆర్ఎంఈ రవి వర్మ, హనుమ, ఇస్నపల్లి శ్యాముల్ పాల్గొన్నారు.