బూర్గంపహాడ్, ఏప్రిల్ 14 : బూర్గంపాడు మండలం ఐటీసీ పీఎస్పీడీ సారపాక కర్మగారంలో అడ్మిన్ బ్లాక్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీతో నల్ల చొక్కాలతో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. గత 13వ వేతన ఒప్పందంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు నేటికీ నెరవేరలేదన్నారు. మరల 14వ వేతన ఒప్పందం చర్చలు నడుస్తున్న సందర్భంగా కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం చేయాలని గుర్తింపు సంఘం వారి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కార్మికులకు ఆమోద యోగ్యమైనటువంటి రూ.22,000 ప్యాకేజీని తీసుకురావాలన్నారు.
100 శాతం మెడికల్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. గత 13వ వేతన ఒప్పందంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు అయిన షటిల్ కోర్టు నిర్మాణం, జిమ్, ఏసి కార్మికులకు నూతన కోటర్స్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతే కాకుండా అనంతరం హెచ్ఆర్ మేనేజర్ దగ్గరికి వెళ్లి పెండింగ్ సమస్యలు నెరవేర్చాలని, ఖాళీగా ఉన్నటువంటి నూతన కోటర్స్ లిస్ట్ త్వరగా పెట్టాలని అది కూడా సీనియారిటీ ప్రాతిపదికన కార్మికులందరికీ అవకాశాలు కల్పించాలని విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.