– భయంతో బిక్కుబిక్కుమంటున్న రుద్రంపూర్ ప్రజలు
రుద్రంపూర్, సెప్టెంబర్ 05 : ఇంట్లో పనులు చేసుకుంటున్న మహిళపై ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో, వాటి నుండి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని నాలా ఏరియాకు చెందిన కామ భవ్య ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతులు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీస్తుండగా అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో కొంతకాలంగా కోతుల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలోనే గోపిరియాకు చెందిన వృద్ధురాలు మాదాసు లక్ష్మి, నాలా ఏరియాకు చెందిన సునీతతో పాటు కొనిసేటి లింగయ్య అనే వృద్ధుడిపై కోతులు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కోతుల భీభత్సంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏ కాలనీకి వెళ్లినా కోతుల భయంతో ఇంటి తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.
సుమారు మూడేళ్ల క్రితం సింగరేణి అధికారులు కోతులను పట్టించినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ వాటి సంఖ్య భారీగా పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కోతులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వదిలివేస్తుండటంతో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనుషులతో సమానంగా కోతులు కూడా ఈ పంచాయతీ పరిధిలో కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహించిన గ్రామసభల్లోనూ కోతుల బెడద, వాటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోతులను పట్టుకునేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి, ప్రజలకు రక్షణ కల్పించాలని రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.