సాధారణంగా పని విషయాల్లో మహిళలు, పురుషులు ఇద్దరూ చేయలేని పనులు కొన్ని ఉంటాయి. ఒకప్పుడు అయితే.. మహిళలను అసలు పనులకే పంపించేవాళ్లు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. జనరేషన్ మారింది. మహిళలకు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు లభిస్తున్నాయి. అయినప్పటికీ.. కొన్ని పనులను మహిళలు చేయలేరు. ఎక్కువగా బరువులు ఎత్తే పనులు.. మెకానిక్ పనులను ఎక్కువగా మహిళలు చేయరు. కానీ.. అటువంటి స్టీరియోటైప్‌ను ఈ మహిళ బ్రేక్ చేసింది. విల్ పవర్, కష్టపడేతత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ పని అయినా.. పురుషులతో సమానంగా చేయగలరని నిరూపించింది.
ఆమే ఎదలపల్లి ఆదిలక్ష్మి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన ఆదిలక్ష్మి పంక్చర్ షాపును నిర్వహిస్తోంది. కొత్తగూడెం టౌన్‌కు దగ్గర్లోని సుజాత నగర్లో ఉన్న ఓ చిన్న గ్యారేజీలో ఆదిలక్ష్మి.. అవలీలగా బైక్స్, కార్లు, ట్రాక్టర్లు, ట్రక్స్ టైర్లకు పంక్చర్ వేస్తుంది.
గత 5 ఏళ్ల నుంచి ఆదిలక్ష్మి ఈ పనిచేస్తూ తన భర్తకు కూడా చేదోడు వాదోడుగా ఉంటోంది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. వాళ్లకు కావాల్సిన అని పనులు చేసుకొని.. గ్యారేజీకి వచ్చి టైర్లకు పంక్చర్ వేస్తుంది. తను ఏ వాహనం టైరుకు అయినా పంక్చర్ వేయడంలో దిట్ట. అలాగే.. టైర్లను కూడా తను రీప్లేస్ చేయగలదు.
తను ఇప్పుడు తెలంగాణలో తొలి మహిళా మెకానిక్‌గా రికార్డుకెక్కింది. తన భర్తకే చెందిన ఆ గ్యారేజీలో ముందు తను భర్తకు కొన్ని పనుల్లో హెల్ప్ చేస్తుండేది. తన భర్త ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ షాపును తనే చూసుకునేది. ఆ తర్వాత మెల్లగా టైర్లకు పంక్చర్ వేయడం నేర్చుకుంది.
ఇటీవల ఆదిలక్ష్మి గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తనను హైదరాబాద్‌కు పిలిచి సత్కరించారు. తన ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉండేందుకు.. ఏ మహిళా ఎంచుకోని రంగాన్ని ఎంచుకొని.. మహిళలు దేంట్లో తక్కువ కాదు అని ఆదిలక్ష్మి నిరూపించిందని కవిత కొనియాడారు. తనకు టైర్ చేంజ్ చేసే మెషిన్‌ను కూడా కవిత అందించారు.