– 24 గంటలు దాటినా ఆగని కుటుంబ సభ్యుల ఆందోళన
– న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన సర్పంచ్
– కుటుంబానికి న్యాయం కోసం హరీష్, తలసాని, ఈటెలకు బీసీ సంఘ నేతల ఫోన్
– ఐటీసీ యాజమాన్యంతో కొనసాగుతున్న చర్చలు
– అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐటీసీ గేటు వద్ద పోలీసు బందోబస్తు
బూర్గంపహాడ్, జూలై 09 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు వరకూటి నర్సింహారావు బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. అయితే కుటుంబానికి న్యాయం చేయాలని భర్త మృతదేహంతో పిల్లలతో కలిసి బుధవారం సాయంత్రం ఐటీసీ గేటు వద్ద చేపట్టిన ధర్నా 24 గంటలు గడిచినా కొనసాగుతూనే ఉంది. ఈ సంఘటనతో ఐటీసీ గేటు వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒకవైపు నర్సింహారావు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు.. మరోవైపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సర్పంచ్ కిశోర్‌నాయక్ ధర్నాకు దిగడంతో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తోటి కార్మికుడు మృతి చెందడంతో కుటుంబానికి అండగా ఉండేందుకు ఉదయం షిప్ట్‌నకు వెళ్లే వేల మంది కాంట్రాక్టు కార్మికులు స్వచ్ఛందంగా విధులకు హాజరు కాలేదు. మృతుడి కుటుంబానికి ఐటీసీ యాజమాన్యంతో పాటు గుర్తింపు సంఘం కార్మిక నాయకులు న్యాయం చేయాలని కాంట్రాక్టు జేఏసీ నాయకులతో పాటు బీసీ సంఘం, బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొని బాధితులకు అండగా నిలిచాయి. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాల్వంచ డీఎస్సీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ మేడా ప్రసాద్ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంట్రాక్టు కార్మికుడు నర్సింహారావు గుండెపోటుతో మృతి చెందడంతో బాధిత కుటుంబం ఐటీసీ వద్ద ఆందోళన చేస్తున్నారని తెలుసుకున్న సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్ గురువారం ఐటీసీ గేటు వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. కార్మికుడు లంచ్ అవర్‌లో చనిపోయాడు. విధుల్లో చనిపోలేదని ఐటీసీ యాజమాన్యం చెప్పడం బాధాకరమన్నారు. మృతుడి విషయంలో యాజమాన్యం తీరు నిర్లక్ష్యంగా ఉందని, కార్మిక సంఘాలు కల్పించుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐటీసీ యాజమాన్యంతో పాటు కార్మిక సంఘం న్యాయం చేయని పక్షంలో 24 గంటల దీక్షకైనా సిద్ధమంటూ ఐటీసీపై మండిపడ్డారు.

కార్మిక కుటుంబానికి న్యాయం జరిగేనా..?
ఐటీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ గుండెపోటుతో మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం కోరుతూ బీసీ సంఘం నేతలు బీఆర్ఎస్ఎల్పీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, సనతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌లకు ఫోన్ చేశారు. కార్మికుడు నర్సింహారావు మృతిచెందిన విషయంతో పాటు కుటుంబ పరిస్థితిని, ఆందోళన విషయాన్ని వివరించారు. దీనికి వారంతా సానుకూలంగా స్పందించి ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కార్మిక కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు బీసీ నేతలు తెలిపారు.
నర్సింహారావు కుటుంబానికి న్యాయం చేసే విషయంలో ఐటీసీ యాజమాన్యంతో కార్మిక సంఘం నేతలు చేస్తున్న చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికుడు బుధవారం మృతిచెందగా గురువారం సాయంత్రం అంటే ఇప్పటివరకు 24 గంటలు గడిచినా బాధిత కుటుంబానికి మాత్రం ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మృతదేహంతో కుటుంబసభ్యులు చేపట్టిన ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. చర్చల్లో బాధిత కుటుంబం రూ.30 లక్షలతో పాటు పర్మినెంట్ ఉద్యోగం డిమాండ్ చేయగా బాధిత కుటుంబానికి సాధారణంగా వచ్చే రూ.10 లక్షలతో పాటు మరో రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఐటీసీ యాజమాన్యం కార్మిక సంఘంతో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో, లేదో వేచి చూడాల్సిందే.