రుద్రంపూర్, మే 2 : స్వయం సహాయక సంఘంలో సభ్యులందరూ కలిసి తీసుకున్న రుణ భారం ఒక్కరిపై మోపడం సరైంది కాదంటూ ఓ మహిళ బ్యాంకు ముందు నిరసనకు దిగింది. “శ్రీ ప్రియ” స్వయం సహాయక సంఘంలో ఒకరైన ఎన్.డి. లలిత తనకు ప్రభుత్వం ఇస్తున్న వితంతు పింఛన్‌ను బ్యాంకు అధికారులు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సభ్యులందరూ కలిసి కట్టాల్సిన రుణాన్ని ఒక్కరిపై మోపడం ఇదెక్కడి న్యాయం అని ఆమె బ్యాంకు ముందు బైఠాయించింది.
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో నివసించే మహిళలు “శ్రీ ప్రియ” స్వయం సహాయక సంఘంగా ఏర్పడి 2023లో రుద్రంపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.3.50 లక్షల రుణం తీసుకున్నారు. అయితే సభ్యులందరూ సమయానికి రుణం చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.4.70 లక్షలకు పెరిగింది. ఈ గ్రూపులో సభ్యురాలైన ఎన్.డి. లలిత ప్రభుత్వ వితంతు పెన్షన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తోంది. అయితే.. ఇటీవల బ్యాంకు అధికారులు ఆమె పెన్షన్ ఖాతాను నిలిపివేయడంతో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
“లోన్ అందరం కలిసి తీసుకున్నాం. నేను నా వంతు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మిగతా సభ్యులు చెల్లించకపోవడంతో నా పెన్షన్ ఆపడం ఏంటి?” అంటూ బ్యాంకు గేటు ముందు కూర్చుని లలిత నిరసన తెలిపింది. “నాకు వచ్చే రూ.2000 పెన్షన్‌తోనే జీవనం సాగుతోంది” అని లతిత ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సీపీఐ పార్టీ నాయకులు బ్యాంకు మేనేజర్‌ను కలిసి సమస్యను వివరించారు. లలిత ఖాతాలో ఉన్న రూ.26 వేలును లోన్ ఖాతాకు జమ చేయడంతో పాటు, పెన్షన్ ఖాతాను లోన్ ఖాతా నుండి వేరు చేయాలని కోరారు. గ్రామస్తులు, సీపీఐ నాయకుల ఆందోళన నేపథ్యంలో బ్యాంకు అధికారులు మే నెల పెన్షన్‌ను లలితకు విడుదల చేశారు. పెన్షన్‌పై ఆధారపడిన ఒక వితంతువును ఇలా వేధించడం సరికాదని, గ్రూపు సభ్యులందరినీ పిలిచి రుణం చెల్లించేందుకు ఒప్పించాలని స్థానికులు మేనేజర్‌ను కోరారు.