రుద్రంపూర్, జూన్ 04 : ప్రజా సమస్యల పరిష్కార మార్గంగా గ్రామ సభలు ఉండాలని, పరిష్కార మార్గం చూపని గ్రామ సభలు ఎందుకని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులను ప్రశ్నించారు. 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆమె మాట్లాడుతూ గత గ్రామ సభలో తీసుకున్న సమస్యలకు సంబంధించి ఎంత వరకు పరిష్కారం చూపారో ప్రజలకు తెలుపాలని ఆమె అధికారులను ప్రశ్నించారు. గత ప్రజా పాలన గ్రామ సభలో సామాజిక పింఛన్లు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ప్రజలు ఎదురు చూశారని, ఎందుకు పెన్షన్ల పంపిణీ చేయలేదో ప్రజలకు వివరించాలని ఆమె అధికారులను కోరారు. అలాగే ఇందిరమ్మ గృహ పథకం రామవారానికి వర్తింప చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆమె విమర్శించారు.
రామవరం ప్రాంత ప్రజలకు సొంత స్థలం ఉంది అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. డివిజన్ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా శానిటేషన్ పట్ల శ్రద్ధ తీసుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే తడి చెత్త ,పొడి చెత్త ఇతర రకాల పదార్థాలను వేరు చేయడంలో 16 వ డివిజన్ ప్రజలు చైతన్యవంతమై ఉన్నారని ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. అదేవిధంగా రామవరంలో ఇంకుడు గుంటలు కూడా ప్రజలు సహకరించవలసినటువంటి అవసరం ఉందని ప్రజలకు తెలిపారు. అకాల వర్షం కారణంగా గ్రామ సభకు అవాంతరం కలిగినప్పటికీ వర్షంలో కూడా గ్రామ సభకు సహకరించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
టూ టౌన్ ఎస్ఐ రాజు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వార్డ్ స్పెషల్ ఆఫీసర్ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలను ప్రజలకు చేరవేడంలో ప్రభుత్వ ఉత్తర్వుల అనుసరించి అర్హులైన పేద వారందరికీ సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ శివరాం, రామయ్య, జవాన్ లక్ష్మణ్, ఆర్పీలు జానకి, కవిత, ఏఎన్ఎం కవిత, తార, శానిటేషన్ వర్కర్స్ శాంత, సందీప్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.