చుంచుపల్లి, ఏప్రిల్ 29 : భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని రాంపురం, అంబేద్కర్‌నగర్ పంచాయతీలకు చెందిన సుమారు 120 మంది రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయబోయే పాయింట్ వద్దకు చేర్చి ఎదురు చూపులు చూస్తున్నారు. అసలే అకాల వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యం తడిస్తే వాటిని ఆరబెట్టడం, తేమశాతం పెరగడం, రంగు మారడం వంటి ఇబ్బందులు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధాన్యం తేమ శాతం తగ్గేందుకు గత వారం రోజుల నుండి ధాన్యాన్ని ఎండబెట్టి కొనుగోళ్లకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంతవరకు కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. ఇంకా ఆలస్యం అయితే ఏ వర్షం వచ్చి ధాన్యం తడుస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద తూర్పార పట్టే మిషన్ సైతం ఒకటే ఉందని, సుమారు 100 మందికి పైగా ఉన్న రైతులకు ఆ ఒక్క మిషన్ సరిపోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్ అధికారులు సైతం పట్టాలు అందరికీ ఇవ్వడం లేదని, వర్షం వస్తే వడ్లు తడిచి ముద్ద అవుతాయని, పట్టాలు అందరికీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.