దమ్మపేట, జూలై 08 : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా బుధవారం దమ్మపేట ఆటో అడ్డ వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో మూడి చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇంధన ధరలను పెంచి వాహనరంగంపై, సామాన్య ప్రజలపై అదనపు భారం మోపిందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు బిజెపి ప్రభుత్వం ఇలా ప్రజల జేబులు ఖాళీ చేస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మూలంగా రవాణా రంగం ఆటో, ట్రాలీ, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులు అదానీ, అంబానీ కోసం 4 లేబర్ కోడ్స్ ను అమలు చేస్తూ కార్మికుల పొట్ట కొడుతుందని విమర్శించారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్సు వల్ల వంద మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కారు ట్రావెల్స్, ఆటో, ట్రాక్టర్, లారీ వాహనాలకు గిరాకి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో ములిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ధరలు పెంచడం అన్యాయమన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, రామకృష్ణ, విక్రమ్, కుటుంబరావు, ప్రసాద్, లక్శ్మీనారాయణ, రాజు పాల్గొన్నారు.