టేకులపల్లి, మే 30 : ఉపాధి హామీ పథకాన్నిపేదలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామ పంచాయతీ రాజారామ్ తండాలో చేపట్టిన ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉపాధి శ్రామికులకు రాజారామ్ తండా నందు 100 బాస్కెట్లు (బొచ్చలు), 60 గడ్డపారులు పంపిణీ చేశారు. అలాగే బోడు గ్రామ పంచాయతీ బోడు గ్రామం నందు పనిచేస్తున్న ఉపాధి కూలీలకు 100 బొచ్చలు, 60 గడ్డపారలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాది హామీ పథకం పేదలకు మంచి వరమని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతిరోజు ప్రతి శ్రామికుడు రూ.307 పనిని ఖచ్చితంగా కొలతల ప్రకారం చేయాలన్నారు. మండలంలో బోరు బావి ఉన్న ప్రతి రైతు విధిగా ఫారం పాండ్ పనులు వారి భూముల్లో నిర్మించుకుని ఆర్థికంగా పురోగతి చెందాలని ఆకాంక్షించారు. పండ్ల తోటలు పెంపకం, మునగ సాగు, చేప పిల్లల పెంపకం, పశువులకు, మేకలకు షెడ్లు ఉపాధి హామీ నుంచి ఇస్తున్నందున మండలంలో ఆసక్తి గల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి శ్రామికుడు తప్పక ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు.