రామవరం, అక్టోబర్ 25 : సింగరేణి సహకారంతో సత్తుపల్లిలో ఆదివారం నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పి అండ్ పి) కె.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, డాక్టర్ దయానంద్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, ఫార్మసీ వంటి అర్హతలతో 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలు, వాటి జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం జివి కోటిరెడ్డి, డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, కిష్టారం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎంవీ.నరసింహారావు, జివిఆర్ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.