రుద్రంపూర్, జూలై 08 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మికుల నివాస ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్వహణ అధ్వానంగా మారిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సివిల్ విభాగం అధికారులు తగిన పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు నిబంధనలను పాటించడం లేదని వారు అంటున్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల ఇళ్లపై ఉన్న వాటర్ ట్యాంకులు, ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్యాంకులు, సులభ్ కాంప్లెక్స్‌లలోని వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసేందుకు ప్రతి ఏడాది లక్షల రూపాయలతో కాంట్రాక్టులు కేటాయిస్తోంది. టెండర్ నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒకసారి ట్యాంకులను పూర్తిగా శుభ్రం చేసి సున్నం వేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి ట్యాంకులను శుభ్రం చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో వాటిలో పాకురు (నాచు) పేరుకుపోయి, ఇళ్లకు సరఫరా అయ్యే నీటిలో కూడా నాచు ముక్కలు, చిన్న చిన్న పురుగులు వస్తున్నాయని కార్మికులు వాపోతున్నారు.
దీంతో తాగునీరు, వినియోగ నీరు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయిస్తున్నప్పటికీ, పనులు పూర్తిస్థాయిలో జరగడంలేదని, ప్రజా ఆరోగ్యం దెబ్బతినేలా వ్యవహరిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా ప్రతి నెలా వాటర్ ట్యాంకులను నిబంధనల ప్రకారం శుభ్రం చేసి కార్మికులకు సురక్షితమైన నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై నమస్తే తెలంగాణ కొత్తగూడెం ఏరియా సివిల్ ఈఈ సుమంత్ ను వివరణ కోరగా మూడు నెలలుగా వర్క్ ఆర్డర్ కూడా వేయలేదని సంబంధిత కాంట్రాక్టర్ ని పిలిచి మందలించామని. రేపు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని అన్నారు. రేపటి నుండి పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించామని తెలిపారు.