రామవరం, మే 06 : కేంద్రం నుండి రావాల్సిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలం నుండి అనుమతులు రావాల్సి ఉందని, అనుకున్న సమయంలో అనుమతులు వస్తే రెండు నెలల్లో వెంకటేశ్ గని ఓపెన్ కాస్ట్ ప్రారంభమవుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం ఏరియా 2025-2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడిన 13.07 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 12.09 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 93% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి తేదీ.05.05.2025 వరకు 14.57 లక్షల టన్నులకు గాను 14.35 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 98 శాతం ఉత్పత్తి లక్ష్యం సాదించమని, రోడ్డు, రైల్ ద్వారా 13.76 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు చెప్పారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి తేదీ 05.05.2025 వరకు 16.12 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినట్లు ఆయన వెల్లడించారు.
కొత్తగూడెం ఏరియా ఇప్పటి వరకు 650 మంది వారసులకు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు, 70 మందికి ఉద్యోగం బదులు ఏక మొత్తం చెల్లించడం జరిగిందన్నారు. ఒకరికి నెలవారి భృతి మంజూరు చేయటం జరిగిందన్నారు. గత ఆర్దిక సంవత్సరం (2023-24) లో 10 లక్షల వరకు ఇంటి రుణంపై వడ్డీని కొత్తగూడెం ఏరియా 347 దరఖాస్తులకు గాను 299 మందికి ఇంటి రుణంపై వడ్డీని ఇవ్వడం జరిగింది. మిగిలిన 33 మందికి సరైన పత్రాలు సమర్పించినచో మంజూరు పత్రాలు అందజేస్తామని తెలిపారు. అదే విధముగా ఇంటి రుణంపై వడ్డీ కోసం నూతనంగా 15 మందికి మంజూరు పత్రాలు అందించినట్లు వెల్లడించారు.
ఏరియాల్లో చాలామంది ఉద్యోగులు విధులకు గైర్హాజరవుతున్నారని, వారికి ఇప్పటికే కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రావడంలేదన్నారు. ఇలా అయితే సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందన్నారు. దీనిని గమనించి గైర్హాజరవుతున్న ఉద్యోగులు అర్థం చేసుకోవాలని, కేవలం ఏరియాలోని పీవీకే 5 ఇంక్లైన్లో 725 మంది గాను 400 మందే హాజరవుతున్నారని, ఇలా అయితే ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే గని అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారని, మార్పు రాకపోతే త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహించి వారి పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్. ఓ. టు జిఎం జి.వి. కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజీఎం (సివిల్) సీహెచ్.రామకృష్ణ, ఏజిఎం (ఫైనాన్స్) కె.హాన సుమలత, డి.జి.ఎం (పర్సనల్) బి.శివ కేశవరావు, డి.జి.ఎం (ఐ.ఈ) ఎన్.యోహన్, ప్రాజెక్టు ఆఫీసర్ జికేఓసి ఎం. శ్రీ రమేశ్, మేనేజర్ పద్మావతి ఖని ఎం.వి.ఎన్. శ్యామ్ ప్రసాద్, అధికారులు మజ్జి మురళి, బి.శంకర్, సింగరేణి సేవా సమితి కో ఆర్డినేటర్ సాగర్, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంధి పాల్గొన్నారు.