పాల్వంచ, మార్చి 21 : పాల్వంచ మండలంలోని జగన్నాథపురం, కేశపురం గ్రామాల మధ్య గల ప్రసిద్ధి చెందిన శ్రీ కనకదుర్గ అమ్మవారి (పెద్దమ్మతల్లి ) దేవాలయం కమిటీని ఇటీవల ప్రభుత్వం ( దేవాదాయ ధర్మాదాయ శాఖ ) ఎంపిక చేసింది. కాగా ఈ కమిటీ నిర్మాణంపై గ్రామస్తులు శుక్రవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ నిరసన తెలిపారు. పెద్దమ్మ తల్లి నీ బిడ్డలకి నువ్వే న్యాయం చేసి ఆదుకోవాలి అమ్మ అంటూ కేశవాపురానికి చెందిన గంధం నరసింహారావు ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి వినతి పత్రాన్ని సమర్పించారు.
పాల్వంచ మండలం కేశవాపురం- జగన్నాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం నూతన కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించలేదంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి అమ్మవారి గుడిలో వినతిపత్రం సమర్పించారు. ఈ కమిటీ ఎంపిక ఓ మంత్రి కనుసన్నల్లోనే జరుగడంపై గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. దీన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు కమిటీ ఎంపికను తప్పుపడుతూ వినూత్న రీతిలో తమ ఆవేదనను ఎల్లగక్కుతూ అమ్మవారి సమక్షంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గంధం నరసింహారావు మాట్లాడుతూ.. కేశవాపురం-జగన్నాథపురం గ్రామస్తులు 1960 సంవత్సరం కంటే ముందునుంచి అనేక ఏళ్లుగా అమ్మవారి సేవలో ఉంటూ దేవాలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాంటిది ఇప్పుడు నూతన పాలకమండలిలో స్థానికులను విస్మరించి కొత్తవారిని తీసుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు తమకు జరిగి అన్యాయాన్ని గమనించి, స్థానికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్నాథపురం, కేశపురం గ్రామాలకు చెందిన కొండం పుల్లయ్య, పెద్దయ్య, బానోత్ కుమార్, వీరభద్రం, గంధం సతీశ్, లక్ష్మణ్, దేవ, వెంగళరావు, సత్యనారాయణ, రమేశ్, ఉదయ్, నాగేశ్, కృష్ణ, భాస్కర్, రాము, మహేశ్, శ్రీను, జంపన్న, నరసింహ, నాగేశ్వరరావు, లిఖిత్, సతీశ్, స్వరూప, శ్రీరంగ, దేవి, కళ్యాణి, మల్లీశ్వరి, సుమ, సౌజన్య పాల్గొన్నారు.