చండ్రుగొండ, ఏప్రిల్ 29: ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అర్హులకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..చండ్రుగొండ పంచాయతీ పరిధి అయ్యన్నపాలెం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు దక్కలేదు. గ్రామంలో ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికార పార్టీ నాయకులు పైసలు, లంచాలు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇంటిని కొత్తగా మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు, వితంతువులకు, వికలాంగులకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇల్లు, అనర్హులకు, ఆస్తులు ఉన్నవారికి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలు నమోదు చేసుకొని కనీస విచారణ చేపట్టలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అయ్యన్నపాలెం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.