– భారీగా దెబ్బతిన్న ఇంజిన్, బ్యాటరీ, వైరింగ్
– పోలీసులకు సర్పంచ్, కార్యదర్శి ఫిర్యాదు
జూలూరుపాడు, మార్చి 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. గ్రామంలో నిత్యం పారిశుధ్య పనులకు ఉపయోగించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు అర్థరాత్రి నిప్పు పెట్టి దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ చాలా వరకు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. సోమవారం రోజంతా గ్రామ పారిశుధ్య పనులు, ఇతర అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ట్రాక్టర్‌ను సాయంత్రం పని ముగిసిన అనంతరం పంచాయతీ కార్యాలయం ఎదుట నిలిపివేసి సిబ్బంది వెళ్లారు. అయితే అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్ టైర్ వద్ద పట్టా పెట్టి నిప్పు పెట్టారు. మంటలు క్రమంగా వ్యాపించి టైర్‌తో పాటు బ్యాటరీ, ఇంజిన్ వైరింగ్ భాగం పూర్తిగా కాలిపోవడం ప్రారంభమైంది.
మంటలు చెలరేగడాన్ని గమనించిన సమీప నివాసితులు వెంటనే గ్రామ సర్పంచ్, ఇతర గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులంతా ఏకమై నీళ్లు పోసి మంటలను ఆర్పేయడంతో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధం కాకుండా బయటపడింది. అయినప్పటికీ ప్రధాన భాగాలు కాలిపోవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే వాహనంపై ఇలాంటి దాడులకు పాల్పడటంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సర్పంచ్ బానోత్ సుమలత, పంచాయతీ కార్యదర్శి బి.బాబులాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సాయిరాం తండాలో దుండగుల ఘాతుకం.. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు నిప్పు!