బూర్గంపహాడ్, జూలై 08 : సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హచ్‌ఎం) డిప్యూటీ డైరెక్టర్ వరుణ్ సూచించారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు లక్ష్మీపురం, టేకులచెరువు సబ్ సెంటర్లను సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పీహెచ్సీలో గ్రామ స్థాయిలో గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు, రక్తపోటు, మధుమేహం వచ్చిన వారికి చికిత్స విధానం, మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల తీసుకునే జాగ్రత్తలు, అందిస్తున్న వైద్యసేవలను పీహెచ్సీ వైద్యులు నగేశ్‌ను అడిగి తెలుసుకున్నారు.
వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ వంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వ్యాధుల పట్ల ప్రజలకు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో మందుల నిల్వలను అడిగి తెలుసుకుని అన్నిరకాల మందులు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, జిల్లా సంక్రమిత వ్యాధుల నివారణ అధికారి దినేష్, జిల్లా ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ ఆఫీసర్ సలిత, జిల్లా అదనపు మలేరియా నివారణ అధికారి గొంది వెంకటేశ్వర్లు, ఎంఎల్హెచ్లు, ఏఎన్ఎం, ఆశాలు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.