రామవరం, అక్టోబర్ 27 : సింగరేణి ఉద్యోగులందరూ నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సత్ప్రవర్తన పెంపే లక్ష్యంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 02వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నిర్వహించిన చేపట్టిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో ఐటి ఆధారిత సిస్టమ్స్ ద్వారా అవినీతికి తావులేకుండా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొత్తగూడెం ఏరియాలో ప్రతి ఒక్కరూ లాలూచి పడకుండా, కచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూ అవినీతి నిర్మూలనకు కృషి చేస్తూ సంస్ధ పురోగాభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ప్రతీ ఫైల్ ను కూడా అలసత్వంతో ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఏరియాని అవినీతి రహిత ఏరియాగా తీర్చిదిద్దాలని, అందుకు అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి సంస్ధకు ఉత్పత్తి, లాభాలు, భద్రత, సంక్షేమంతో పాటు సంస్థలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అవినీతి రహితంగా విధులు నిర్వహించడం అత్యంత ముఖ్యమైన అంశమని అందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.
“జాగరూకత : మా భాగస్వామ్య బాధ్యత (Vigilance: Our Shared Responsibility)” అనునది ఈ సంవత్సర విజిలెన్స్అవగాహన వారోత్సవాల నినాదమని తెలిపారు. ఈ సందర్భంగా డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు ఉద్యోగులందరిచే అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఆయా గనుల మేనేజర్లు, అధిపతులు ఉద్యోగులందరిచే అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ యూనియన్ ప్రతినిధి ఉమాయిన్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్, ఎస్ఓటు జిఎం జి.వి.కోటిరెడ్డి, ఇతర విభాగాల అధిపతులు, అధికారులు, జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Ramavaram : సింగరేణి ఉద్యోగులందరూ నిబద్ధతతో పని చేయాలి : జీఎం శాలెం రాజు