రుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇనుగంటి నాగరాజు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాలపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడిపై అసత్య ఆరోపణలు చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
డీఎస్పీ ఆదినారాయణ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. నిందితుడు సాదం శివాజీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నాగరాజు లైంగిక వేధింపులు, చేతబడికి పాల్ప డినట్లు పేర్కొనడాన్ని కుటుంబ సభ్యులు ఖండించారు. నాగరాజు చెల్లెలు ప్రవళిక మాట్లాడుతూ.. శివాజీ భార్య తమ కుటుంబానికి బంధువేనని, అలాంటి పరిస్థితుల్లో వేధింపుల ఆరోపణలు చేయడం అవాస్తవమని అన్నారు. తమ అన్నపై తప్పుడు ప్రచారం చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
గత కొంతకాలంగా శివాజీ పిల్లల ఆరోగ్యం బాగాలేకపోవడంతో నాగరాజుపై చేతబడి అనుమానం పెంచుకుని హత్యకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఆదివారం పెద్దమ్మ గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో చేతులు కడుక్కునే సమయంలో శివాజీ భార్యతో నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతున్నారని, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే నిజం బయటికి వస్తుందని ఆమె అన్నారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని, హత్య సమయంలో ఉపయోగించిన ఆటోను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రవళిక ప్రశ్నించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులందరిపై కేసులు నమోదు చేయాలని నాగరాజు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ధర్నా సందర్భంగా నాగరాజు స్నేహితుడు పోతురాజు నవీన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మృతుడు నాగరాజు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నవీన్‌ను నిప్పంటించుకోబోయాడు. అప్రమత్తమైన గ్రామస్తులు, పోలీసులు వెంటనే అడ్డుకుని అతడిపై నీళ్లు పోసి కాపాడారు. నాగరాజు హత్య కేసుపై స్పందించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.