చండ్రుగొండ, జూన్ 06 : వానాకాలం సమీపించిన తరుణంలో హడావిడిగా అలుగు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్యగూడెం గ్రామంలోని వెంగళరావు ప్రాజెక్ట్ అలుగు ప్రదేశాన్నితెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు అలుగు పూర్తిగా కొట్టుకుపోవడంతో అధికారికంగా 2,500 ఎకరాలు, పరోక్షంగా మరో 1,500 ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇదే విషయంపై రైతు సంఘం ఆధ్వర్యంలో అనేకమార్లు ఆందోళనలు చేపట్టడం జరిగిందన్నారు.
కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.33.55 కోట్లు నిధులు మంజూరు చేయడం స్వాగతిస్తున్నామన్నారు. కానీ వర్షాలు ప్రారంభమయ్యే సమయంలో హడావిడిగా కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పనులు ప్రారంభమయ్యాక భారీ వర్షాలు వచ్చి నిర్మాణం కొట్టుకుపోతే పరిస్థితి ఏంటన్నారు. ఇదే వంకతో తిరిగి ప్రాజెక్టు వ్యయం (ఎస్టిమేషన్లు) పెంచే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
అలుగు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో అధికారులు దగ్గరుండి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అంతేకానీ కాంట్రాక్టర్లను బాగు చేసేందుకు ప్రయత్నిస్తే రైతు సంఘం చూస్తూ ఊరుకోదన్నారు. పనులను వేగవంతం చేసి అలుగు నిర్మాణం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి, జిల్లా రైతు సహాయక కార్యదర్శి కునుసోత్ ధర్మా, జిల్లా కమిటీ సభ్యులు కె.తిరుపతిరావు పాల్గొన్నారు.