సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో కళాశాలలో అనధికారికంగా పెంచిన ఫీజులపై నమస్తే తెలంగాణలో ‘ఫీజులు ఫుల్.. సౌకర్యాలు నిల్’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఫీజులు పెంచిన అంశంపై ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆయుష్ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ఆయుష్ డైరెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఆయుష్ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో డైరెక్టర్ సమావేశం నిర్వహించనున్నారు.
కాగా, ప్రభుత్వ అనుమతి లేకుండా హోమియో యూజీ, పీజీ విద్యార్థుల ఫీజులు పెంచడంపై ‘ఫీజులు ఫుల్…సౌకర్యాలు నిల్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో కళాశాల ప్రిన్సిపాల్ డా.లింగరాజు స్పందించి వివరణ ఇచ్చారు. 2015లో హోమియో పీజీ సీట్లను 60నుంచి 100కు పెంచడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కోసం రూ.43.92లక్షలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంజూరు చేసిందని, కాని ఆ నిధులు ఇప్పటి వరకు తమకు అందలేదని వివరించారు.
2019-20లో మరో సారి యూజీ సీట్ల సంఖ్య 100నుంచి 125కి, పీజీ సీట్ల సంఖ్య 30నుంచి 38కి పెంచడం జరిగింది కాని మంజూరు చేసిన నిధులు తమ కళాశాలకు విడుదల కాలేదని వివరించారు. ఈ విషయాన్ని 2017-18లో నాటి డైరెక్టర్ డా.రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుళ్లామని, దీనికి స్పందించి నాటి డైరెక్టర్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి, ఫీజులను పెంచుకోమని మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. నాటి డైరెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకే 2017-18విద్యా సంవత్సరంలో రూ.10వేలుగా ఉన్న యూజీ ఫీజును రూ.24వేలకు, 2018-19 విద్యా సంవత్సరం నుంచి 24వేలుగా ఉన్న యూజీ ఫీజును రూ.26వేలకు, ఆ తరువాత రూ.26వేల నుంచి రూ.29వేలకు పెంచామన్నారు.
అదే విధంగా 2017-18విద్యా సంవత్సరానికి హోమియో పీజీ విద్యార్థుల ఫీజును రూ.21,600నుంచి ఒకేసారి రూ.40,500కు, ఆ తరువాత 2019-20విద్యా సంవత్సరంలో రూ.40,500నుంచి రూ.49.300కు పెంచినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. కాగా, వార్తా కథనంలో పేర్కొన్న హాస్పిటల్ అండ్ ఫ్యాకల్టీ ఫీజు, డిజిటల్ లైబ్రరీ, ఐటీ ల్యాబ్, ఇప్పటి వరకు ప్రచురితం కాని మ్యాగజైన్, జర్నల్స్, కాషన్ మనీ తదితర అంశాలకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.