– ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
– ఎస్కే చాంద్ పాషా
జూలూరుపాడు, సెప్టెంబర్ 05 : దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్న తరుణంలో, హక్కుల పరిరక్షణ కోసం యువత ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9, 10వ తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల ప్రచార గోడ పత్రికను శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి జూలూరుపాడు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాసభల ప్రారంభ రోజైన సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 2 గంటలకు జరిగే భారీ యువజన ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
రిక్రూట్మెంట్ల పేపర్ లీకేజీలు, విద్యా-వైద్య రంగాల ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాలతో యువతపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, పాలకులు ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహాసభల్లో విద్య, ఉపాధి, సామాజిక న్యాయంపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బరగడ రమేశ్, మండల సహాయ కార్యదర్శులు చీమకుర్తి సంతోశ్, ఎస్కే బోలేమియా, పత్తిపాటి మహేశ్, నాయకులు శివకృష్ణ, వెంకటేష్, నరేశ్, సురేశ్, గోపి, మోహన్ పాల్గొన్నారు.